సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన.. 46 మంది రిమాండ్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన.. 46 మంది రిమాండ్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకాన్ని నిరసిస్తూ  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం జరిగిన ఘటనలో పోలీసులు 46  మంది ఆర్మీ అభ్యర్థులను అరెస్టు చేశారు.  తొలుత వారికి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, రైల్వే కోర్టు  న్యాయమూర్తి  ఎదుట హాజరుపరిచారు.  రైల్వే కోర్టు.. వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.  అనంతరం నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు.  వారిపై రైల్వే పోలీసులు.. సెక్షన్ 143, 147, 324, 307, 435,427, 448, 336, 332, 341, రెడ్ విత్ 149 తో పాటు  ఇండియన్ రైల్వే యాక్ట్ 150, 151, 152, కింద కేసులు నమోదు చేశారు.

స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్..

 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకాన్ని నిరసిస్తూ  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం జరిగిన ఘటన పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది.  దీనికి సంబంధించి వివిధ ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాల ఆధారంగా  సుమోటోగా కేసును స్వీకరించింది.  జూలై 20లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్పీఎఫ్ , జీఆర్పీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 

గురువారం రోజే బిహార్, యూపీ, హరియాణా రాష్ట్రాల్లో..

కాగా, ‘అగ్నిపథ్’ పథకంలోని నిబంధనలను వ్యతిరేకంగా గురువారం రోజే బిహార్, యూపీ, హరియాణా రాష్ట్రాల్లో ఆందోళనలు ఉధృతంగా జరిగాయి.  శుక్రవారం ఆ ఆగ్రహ జ్వాలలు తెలంగాణను కూడా తాకాయి. భారీ సంఖ్యలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు తరలివచ్చిన ఆర్మీ అభ్యర్థులు ఒక్కసారిగా విధ్వంసానికి దిగారు.  మూడు ఫ్లాట్ ఫాంలను పూర్తిగా ధ్వంసం చేశారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌, ఈస్ట్‌ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ సహా మూడు రైళ్లకు నిప్పంటించారు. రైల్వే స్టేషన్ బయట బస్సులపై రాళ్లు రువ్వారు. భారీ సంఖ్యలో నిరసనకారులు తరలిరావడంతో పోలీసు యంత్రాంగం నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు టియర్ గ్యాస్ ప్రయోగించి నిరసనకారుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం దబీర్ పేటకు చెందిన రాకేశ్ అనే 18ఏండ్ల యువకుడు మృతి చెందాడు. మరో 14 మంది గాయపడ్డారు. వారిని గాంధీ హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు.