ఐసెట్ లో 46,654 మంది క్వాలిఫై

ఐసెట్ లో 46,654 మంది క్వాలిఫై
  • ఫలితాలు విడుదల చేసిన టీజీసీహెచ్ఈ చైర్మన్ 
  • 91.62 శాతంతో అమ్మాయిలదే పైచేయి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీజీఐసెట్​లో 91.22% మంది క్వాలిఫై అయ్యారు. శుక్రవారం తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసులో ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్​తో కలిసి టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి టీజీఐసెట్ ఫలితాలను రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 56,206 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో  51,146 మంది పరీక్షకు అటెండ్ అయ్యారు. వీరిలో 46,654 మంది క్వాలిఫై అయ్యారు.

ఫలితాల్లో మరోసారి అమ్మాయిలే పైచేయి సాధించారు. పరీక్షకు హాజరైన 27,793 మంది అమ్మాయిల్లో 25,463 మంది (91.62 శాతం) క్వాలిఫై అవ్వగా.. 23,353 మంది అబ్బాయిల్లో 21,191 మంది (90.74 శాతం) అర్హత సాధించారు. ఐసెట్ ర్యాంకింగ్ కోసం జనరల్, ఓబీసీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 25 శాతంగా నిర్ణయించారు. ఐసెట్ క్వాలిఫై అయిన వారిలో అత్యధికంగా బీకామ్ విద్యార్థులు  ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో బీఎస్సీ, బీబీఏ, బీటెక్ విద్యార్థులు ఉన్నారు.

కాగా, అర్హత సాధించిన అభ్యర్థులు తమ ర్యాంకు కార్డులను అధికారిక వెబ్‌‌సైట్ https://icet.tgche.ac.in నుంచి డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చని ఐసెట్ కన్వీనర్ అలువల రవి తెలిపారు. త్వరలోనే  ఎంబీఏ, ఎంసీఏ అడ్మిషన్ల షెడ్యూల్ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఐసెట్ టాపర్​గా దిల్ సుఖ్ నగర్​కు చెందిన ఐశ్వర్య రెడ్డి, రెండో ర్యాంకు హైదరాబాద్​కు చెందిన కే. లిఖిత, మూడో ర్యాంకు శ్రీచరణ్ రెడ్డి సాధించారు. కార్యక్రమంలో టీజీసీహెచ్ఈ వైస్ చైర్మన్లు ఇటిక్యాల పురుషోత్తం, మహమూద్, సెక్రెటరీ శ్రీరామ్ వెంకటేశ్ పాల్గొన్నారు.