
- ఉమ్మడి జిల్లా సమాఖ్య సంఘాలకు 47 అద్దె బస్సులు
- ఒక్కో బస్సు ద్వారా నెలకు రూ.69,498 అద్దె రాబడి
- రూ. 58.96 కోట్ల వడ్డీ లేని రుణాలు
- మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు
పెద్దపల్లి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. ఇందిరా మహిళా శక్తి పేరిట అన్ని రంగాల్లో అతివలను ప్రోత్సహిస్తోంది. దీనిలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు మహిళా సమాఖ్యలకు అద్దెబస్సులు, వడ్డీ లేని రుణాలు, సోలార్ప్లాంట్లను కేటాయిస్తోంది. వీటి ద్వారా ఆదాయాన్ని పొందుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో జిల్లాలోని మహిళా సంఘాలకు ప్రభుత్వం వరాలు కురిపించింది.
వడ్డీ లేని రుణాలు.. ఆర్టీసీ బస్సులు
మహిళా సాధికారతలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మహిళా సమాఖ్యలకు ప్రభుత్వం 47 బస్సులను కేటాయించింది. ఒక్కో బస్సుకు ప్రభుత్వం రూ.30 లక్షలు రుణంగా ఇవ్వగా.. మహిళా సంఘాల నుంచి మరో రూ.6 లక్షలు కలిపారు. మొత్తంగా ప్రభుత్వం 47 బస్సులకు రూ.16.92కోట్లు అందజేసింది. ఈ మేరకు ఆర్టీసీకి, డీఆర్‌డీఏల మధ్య ప్రభుత్వం ఒప్పందం కుదిర్చింది. ఈ బస్సులను ఆయా డిపోల్లో పెట్టి ప్రతినెలా ఒక్కో బస్సుకు రూ.69,498 అద్దె చెల్లిస్తున్నారు.
ఈ లెక్కన ప్రతి నెలా సుమారు రూ.32లక్షలకు పైగా ఆదాయం మహిళా సంఘాలకు సమకూరుతోంది. దీంతో పాటు ఉమ్మడి జిల్లాకు వడ్డీ లేని రుణాల కోసం రూ. 58.96 కోట్లు కేటాయించారు. దీనిలో పెద్దపల్లి జిల్లాకు రూ. 9.81కోట్లు, కరీంనగర్‌కు రూ.22. 68 కోట్లు, జగిత్యాలకు రూ.13.58 కోట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాకు రూ.12. 92 కోట్లు మంజూరు చేశారు. సమాఖ్యలను బలోపేతం చేసేందుకు 15 ఏండ్ల నుంచి 60 ఏండ్లు పైబడిన వారిని కూడా సంఘాల్లో చేర్చాలని ఇటీవల మంత్రులు సూచించారు.
సోలార్‌ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం
మహిళా సమాఖ్యల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీతోపాటు రుణం ఇచ్చి ప్రోత్సహించనుంది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో 1 మెగావాట్కరెంట్ ఉత్పత్తి చేసేందుకు ప్లాంటు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. దీనికోసం రూ.3కోట్లు కానున్నట్లు అధికారులు చెప్తున్నారు.
దీనిలో అధికమొత్తం సబ్సిడీ రూపంలో అందించనుంది. కాగా ఎంత మొత్తం సబ్సిడీ ఇవ్వాలనేది ఇంకా నిర్ణయం కాలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పెట్రోల్ బంకులు, ప్రభుత్వ హాస్పిటళ్లలో, రెసిడెన్సియల్ స్కూళ్లలో మెస్‌లు, కలెక్టరేట్లలో క్యాంటీన్లు, ఇలా అన్ని విభాగాల్లో మహిళా సంఘాలు తమ ప్రతిభను చాటుతున్నాయి.