‘రైతు వేదిక’లపై ఎమ్మెల్యేల పెత్తనం

‘రైతు వేదిక’లపై ఎమ్మెల్యేల పెత్తనం

పార్టీ లీడర్లు, బంధువులు, ప్రైవేటు కాంట్రాక్టర్లకు పనులు

గ్రామ పంచాయతీ గ్రాంట్లనూ వదలట్లే..

నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యేల తీరుపై సెకండ్ క్యాడర్ నారాజ్

నల్గొండ, వెలుగు: అధికార పార్టీ ఎమ్మెల్యేలు పైసలు వచ్చే ఏ పనీ వడలడం లేదు. ఇప్పటికే ఈజీఎస్, ఎస్డీఎఫ్ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులలో చేతులు పెడుతున్న నియోజకవర్గసార్లు ఇప్పుడు రైతు వేదికలపైనా కన్నేశారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కడుతున్న ఈ భవనాల నిర్మాణ పనులను సైతం తమ అనుచరులకే కట్టబెట్టారు. పార్టీలో తమ నమ్మిన బంట్లు, సమీప బంధువులను బినామీ కాంట్రాక్టర్లు గా రంగంలోకి దింపి రైతు వేదికల పనులు చేయిస్తున్నారు. సర్కారు తమకు కేటాయించే నియోజకవర్గ అభివృద్ధి నిధులు చాలవన్నట్టు మండల పరిషత్, పంచాయతీలకు మంజూరు చేస్తున్న నిధులపై కర్ర పెత్తనం చేస్తున్న తీరుపై సర్పంచులు నారాజ్ అవుతున్నారు.

నిధులు రావని చెప్పి

ప్రభుత్వం పంచాయతీల్లో అభివృద్ధి పనులన్నింటిని ఉపాధి నిధుల​తోనే చేయిస్తోంది. గతంలో సీసీ రోడ్లు కూడా ఉపాధి నిధులతోనే నిర్మించారు. దీంతో పాటు నియోజకవర్గాలకు భారీగా ఎస్డీఎఫ్ నిధులు కూడా కేటాయించారు. ఈ పనులన్నీ ఎమ్మెల్యేల అనుచరులు, వారికి సంబంధించిన కాంట్రాక్టర్లకే కట్టబెట్టారు. ఎక్కడా కౌన్సిలర్లకు గానీ, సర్పంచ్ లకు గానీ అవకాశం ఇవ్వలేదు. స్థానిక అవసరాలను గుర్తించే సర్పంచులు, కౌన్సిలర్లను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ప్రతి పనిలో కూడా ఎమ్మెల్యేలే ఇన్కం సోర్సు వెతుక్కుంటున్నారు. ఒకవేళ పనులు చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే వాళ్లకు ఎమ్మెల్యే లు చెప్పే కారణాలు మరింత ఆసక్తికరంగా ఉంటున్నాయి. ‘మీరు పనులు చేస్తే ఇప్పట్లో నిధులు రావు.. పనులు వేగంగా చేయాలని కేసీఆర్ చెప్తుండు’ కాబట్టి మీవల్ల కాదని సర్దిచెప్తున్నారు. దీనికి అధికారులు సైతం వంతపాడటంతో చేసేదేం లేక సైలెంట్ గా ఉండిపోతున్నారు.

బినామీలే కాంట్రాక్టర్లు

నల్గొండ జిల్లాలో 140, సూర్యాపేట జిల్లాలో 82 రైతు వేదికలు మంజూరయ్యాయి . నల్గొండ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ముఖ్యనేతకు చెందిన అనుచరులు, ఓ చైర్మన్ సమీప బంధువులే రైతు వేదికలు నిర్మిస్తు న్నారు. ఇక్కడ 16 వేదికల పనులను ఏడుగురు కాంట్రాక్టర్లకు పంపకాలు చేశారు. నకిరేకల్ నియోజకవర్గంలోనూ ప్రైవేటు కాంట్రాక్టర్లకే పనులు కట్టబెట్టారు. మిర్యాలగూడెం నియోజకవర్గ లో కొన్నిచోట్ల సర్పంచులు చేస్తుండగా… దామరచర్ల, మాడ్గులపల్లి మండలాల్లో మాత్రం పార్టీ లీడర్లకు, మండల ప్రజాప్రతినిధులకు అప్పగించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుమల మండలంలో నాలుగు క్లస్టర్ల పరిధిలోని వేదికలు ఎమ్మెల్యే అనుచరుడికి ఇచ్చారు. మరికొన్ని చోట్ల సర్పంచ్ లు చేస్తున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఓ మండలానికి చెందిన వైస్ ఎంపీపీకి హుజూర్ నగర్ మండలం, నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకీడు వేదికల పనులు అప్పగించగా, మఠంపల్లిలో మరొక లీడర్ కు అప్పగించారు. వీళ్లిద్దరు ఓ కన్ స్ట్రక్షన్  పేరుతో పనులు చేస్తున్నారు. హుజూర్ నగర్ లోకల్ పని మరొక లీడర్ కు కట్టబెట్టారు. కోదాడ నియోజకవర్గంలోని కోదాడ మండలంలోని నాలుగు క్లస్టర్ల పరిధిలోని రైతు వేదికలు ఓ ప్రజాప్రతినిధి భర్తకు అప్పగించారు. అనంతగిరి, చిలుకూరు, మునగాల, మోతె మండలాల్లో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులకు కాం ట్రాక్టు ఇచ్చారు. కొన్నిచోట్ల టీఆర్ఎస్ లీడర్లకే కట్టబెట్టారు. అనంతగిరిలో సర్పంచ్ వేనేపల్లి వెంకటేశ్వరరావు మెటీరియల్‌‌‌‌ తోలించిన తరువాత అతన్ని కాదని రైతు సమన్వయ సమితి సభ్యుడికి కాంట్రాక్టు అప్పగించారు. తమ ప్రాంతంలో నిర్మిస్తున్న రైతు వేదిక గురించి తమకే సమాచారం లేకపోవడాన్ని అధికార పార్టీకి చెందిన సర్పంచులు, పార్టీ లీడర్లు జీర్ణించుకోలేక పోతున్నారు.