ఇయ్యాల్టి నుంచి బొగ్గు గనుల్లో 48గంటల సమ్మె

ఇయ్యాల్టి నుంచి బొగ్గు గనుల్లో 48గంటల సమ్మె
  • సమ్మె సక్సెస్‌‌ కోసం నాలుగు జాతీయ సంఘాల ఏర్పాట్లు
  • మద్దతు తెలిపిన గుర్తింపు సంఘం టీబీజీకేఎస్
  • ప్రైవేటైజేషన్ ఉండదని కేంద్రం..
  • సమ్మె వద్దని సింగరేణి..

గోదావరిఖని/మందమర్రి/ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. 48 గంటల పాటు నిర్వహించే దేశవ్యాప్త సమ్మె సోమ, మంగళవారాల్లో కొనసాగనుంది. బీఎంఎస్ మినహా   సింగరేణిలోని నాలుగు జాతీయ, ప్రాంతీయ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వగా, గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌‌ సమ్మెకు మద్దతు ప్రకటించింది. అయితే దేశవ్యాప్త సమ్మెకు సింగరేణికి ఎలాంటి సంబంధం లేదని, అసలు సింగరేణిని ప్రైవేటైజేషన్​ చేయబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా, పరిశ్రమలలో బొగ్గుకు డిమాండ్‌‌ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఉత్పత్తికి విఘాతం కలిగించవద్దని, సింగరేణిలో సమ్మె చేపట్టవద్దని మేనేజ్‌‌మెంట్ కోరుతోంది. 
ప్రైవేటైజేషన్ ​నిరసిస్తూ..
కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ సంస్థలైన ఎల్ఐసీ, ఇండియన్ రైల్వేస్, ఎయిర్ ఇండియా, నేవీ, మల్టీనేషనల్ కంపెనీలతో పాటు మరికొన్ని సంస్థలను తక్కువ ధరలకు కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తోందని, అందులో భాగంగా బొగ్గు పరిశ్రమను కూడా వారికే కట్టబెడుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రైవేటైజేషన్​కు వ్యతిరేకంగా ఈ నెల 28, 29 తేదీల్లో 48 గంటలపాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇప్పటికే సమ్మె విజయవంతం కోసం కార్మిక సంఘాలు  సింగరేణి వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేశాయి. ఆరు జిల్లాల్లో విస్తరించిన  సింగరేణిలోని 25 అండర్ గ్రౌండ్ మైన్స్, 19 ఓపెన్‌‌ కాస్ట్‌‌ ప్రాజెక్ట్‌‌లతో పాటు వివిధ డిపార్ట్‌‌మెంట్లలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొనాలని కార్మిక సంఘాలు కోరాయి.

గడిచిన పది రోజులుగా జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, ఇప్టూ తదితర యూనియన్లు బొగ్గు గనులపై ప్రచారం నిర్వహించి కార్మికులను సన్నద్ధం చేశాయి. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌‌ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపింది. సింగరేణి వ్యాప్తంగా 43వేల మంది కార్మికులు పని చేస్తుండగా, ఎమర్జెన్సీ సిబ్బంది మినహా, బొగ్గు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే మెజారిటీ కార్మికులు సమ్మెలో పాల్గొనే చాన్స్ ఉంది. 
రెండు రోజులకు రూ.160 కోట్ల నష్టం
సింగరేణిలో రెండు రోజుల  సమ్మె ప్రభావం బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపనుంది. 2021‒22 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు టార్గెట్ వెనుకంజలో ఉన్న నేపథ్యంలో సోమ, మంగళవారం సమ్మె విజయవంతమైతే టార్గెట్‌‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. వాస్తవంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 75 మిలియన్‌‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్‌‌గా మొదట నిర్ణయించారు. అయితే వర్షాలు అధికంగా కురవడంతో టార్గెట్‌‌ను రివైజ్డ్ చేసి 68 మిలియన్ టన్నులకు కుదించారు. ప్రస్తుతం ప్రతి రోజు సింగరేణి వ్యాప్తంగా 2.13 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు.

ఈ నెలాఖరు వరకు ప్రతి రోజు బొగ్గు వెలికితీసినా 65 మిలియన్‌‌ టన్నులు మాత్రమే ఈ ఇయర్‌‌లో సాధించే అవకాశం ఉంది. కానీ రెండు రోజుల సమ్మెతో టార్గెట్‌‌ పై మరింత ప్రభావం పడనుంది. అలాగే సమ్మె వల్ల రెండు రోజులకు రూ.120 కోట్ల వరకు బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతుంది. అలాగే రూ.40 కోట్ల వరకు వేతనాల రూపంలో కార్మికులు నష్టపోనున్నారు. అయితే రెండు రోజుల సమ్మె కాలంలో ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను చేపట్టేందుకు సింగరేణి యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటోంది.  
ఏడాదిలో రెండో సమ్మె
ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుతం జరుగుతున్న సమ్మె రెండోది. గతేడాది డిసెంబర్‌‌లో సెంట్రల్ సర్కార్ అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు, సింగరేణికి సంబంధించిన నాలుగు బొగ్గు బ్లాక్‌‌లను బహిరంగ వేలంలో ఉంచడంతో పాటు మరో 11 సింగరేణి సమస్యల పరిష్కారం కోరుతూ జాతీయ, ప్రాంతీయ కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా  ఇచ్చిన మూడు రోజుల సమ్మె విజయవంతమైంది. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ మూడు రోజుల్లో బొగ్గు ఉత్పత్తి పరంగా రూ.150 కోట్లు, కార్మికులు వేతనాల రూపంలో రూ.50 కోట్ల వరకు నష్టపోయారు. 
రాజకీయ లబ్ధి కోసమే సమ్మె
రాజకీయ లబ్ధి కోసమే దేశవ్యాప్తంగా అన్ని సెక్టార్లలో జాతీయ, ప్రాంతీయ సంఘాలు కార్మికులను రెచ్చగొట్టి సమ్మెకు దిగాయి. అందుకే బీఎంఎస్‌‌, దాని అనుబంధ సంఘమైన సింగరేణి కోల్‌‌మైన్స్‌‌ కార్మిక సంఘ్‌‌ సమ్మెకు దూరంగా ఉంటోంది. సింగరేణిలో ప్రైవేటైజేషన్​పేరుతో ప్రతిపక్ష పార్టీల యూనియన్లు, టీఆర్‌‌ఎస్‌‌ అనుబంధ టీబీజీకేఎస్‌‌ రాజకీయం చేస్తున్నాయి. గతంలో యూపీఏ ప్రభుత్వం కేటాయించిన 212 బొగ్గు బ్లాకులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం బొగ్గు గనుల కేటాయింపులో పారదర్శకమైన విధానాన్ని అవలంబిస్తోంది. ఈ పాలసీలో భాగంగానే తెలంగాణలోని నాలుగు కోల్‌‌ బ్లాక్‌‌లను వేలంలో కేటాయించేందుకు సిద్ధపడగా వీటి కోసం సింగరేణి అసలు దరఖాస్తు చేయలేదు. కార్మికులు నిజాలు తెలుసుకుని డ్యూటీలకు హాజరు కావాలి.  ‒  యాదగిరి సత్తయ్య, బీఎంఎస్‌‌ స్టేట్ ప్రెసిడెంట్‌‌
సింగరేణిలో సమ్మె వద్దు 
నాలుగు జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీస్‌‌లోని డిమాండ్లు సింగరేణి పరిధిలో లేవు. అవి సంస్థ పరిష్కరించేవి కూడా కావు. సోమ, మంగళవారాల్లో కార్మికులు సమ్మెలో పాల్గొనవద్దు. అన్ని గనులు, ఓపెన్‌‌ కాస్ట్‌‌లు తెరిచే ఉంటాయి. ఉద్యోగులంతా యధావిధిగా డ్యూటీలకు హాజరుకావాలి. ఆఫీసర్లు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తారు. ముఖ్యంగా ఓపెన్‌‌ కాస్ట్‌‌ మైన్లలో కోల్‌‌ ప్రొడక్షన్‌‌ జరిగేలా చర్యలు తీసుకోవాలి.   – ఆనందరావు, కార్పొరేట్​ పర్సనల్(ఇండస్ట్రియల్ ​రిలేషన్స్) జీఎం, సింగరేణి