వాషింగ్టన్, టెహ్రాన్, జెరూసలెం: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వల్ల భారీ స్థాయిలో పర్యావరణ విధ్వంసం జరుగుతోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం మొదలైన తర్వాత కేవలం 14 రోజుల్లోనే ఏకంగా 500 కోట్ల కిలోల ఉద్గారాలు గాలిలో కలిసి కాలుష్యానికి కారణమయ్యాయని క్లైమేట్ అండ్ కమ్యూనిటీ రిపోర్టు వెల్లడించింది.
పర్యావరణం పరిస్థితి ఇలా ఉండగా.. ప్రాణ, ఆస్తి నష్టం ఇంకా లెక్కించలేదని తెలిపింది. ఈ పరిణామం భూమి భవిష్యత్తును కూడా ప్రమాదంలోకి నెడుతోందని పేర్కొంది. యుద్ధం ప్రారంభమైన మొదటి 14 రోజుల్లోనే దాదాపు 500 కోట్ల కిలోల (5 బిలియన్ కిలోలు) కర్బన ఉద్గారాలు విడుదలయ్యాయని 'క్లైమేట్ అండ్ కమ్యూనిటీ' ఇన్‌స్టిట్యూట్ తన రిపోర్టులో వెల్లడించింది. ఈ ఉద్గారాల పరిమాణం ప్రపంచంలోని 84 చిన్న దేశాలు కలిసి ఒక ఏడాది పొడవునా విడుదల చేసే మొత్తం కాలుష్యం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.
- భవనాలు కూలిపోవడంతో దుమ్ము..
ఈ స్థాయి కాలుష్యానికి ప్రధానంగా యుద్ధ భూమిలో జరుగుతున్న భవనాల ధ్వంసం ఒక కారణం. బాంబు దాడుల ధాటికి భారీ కట్టడాలు కుప్పకూలడం వల్ల వెలువడిన శిధిలాల నుంచి సుమారు 24 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ గాలిలో కలిసింది. దీనికి తోడు ఇరాన్‌లోని కీలకమైన చమురు రిఫైనరీలు, గ్యాస్ ప్లాంట్లపై జరిగిన దాడుల వల్ల మరో 18 లక్షల టన్నుల ఉద్గారాలు వెలువడి వాతావరణాన్ని విషపూరితం చేశాయి. నిరంతరం ఆకాశంలో చక్కర్లు కొట్టే యుద్ధ విమానాలు, భారీ బాంబర్లు మరియు సముద్రంలో మోహరించిన యుద్ధ నౌకల ఇంధన వినియోగం కూడా ఈ కాలుష్యానికి భారీగా తోడవుతోంది.
- ఆర్థిక భారం తక్కువేమీ కాదంటున్న నిపుణులు..
ఈ పర్యావరణ నష్టం వల్ల కలిగే ఆర్థిక భారం కూడా తక్కువేమీ కాదు. కేవలం 14 రోజుల వ్యవధిలోనే పర్యావరణానికి దాదాపు 1.3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10,800 కోట్లు) నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో విష వాయువుల సాంద్రత పెరగడంతో ఆమ్ల వర్షాలు కురిసే ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే టెహ్రాన్ వంటి ప్రధాన నగరాల్లో చమురు నిల్వలు తగలబడటంతో ఆకాశం మసి పొగతో నిండిపోయి, 'నల్లటి వర్షం' కురుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు, ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధిలో సముద్ర పర్యావరణం కూడా తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. చమురు ట్యాంకర్లపై జరుగుతున్న దాడుల వల్ల సముద్ర జలాల్లోకి చమురు వలయాలు చేరుతున్నాయి. దీనివల్ల సముద్ర జలాలు విషపూరితమై, జలచరాలు మరియు పగడపు దిబ్బలు
భారీ సంఖ్యలో అంతరించిపోయే ప్రమాదం ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేస్తోంది.
