బావిలో పడి ఐదుగురు చిన్నారులు మృతి

బావిలో పడి ఐదుగురు చిన్నారులు మృతి

జోగులాంబ గద్వాల్ జిల్లాలో  విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని మల్దకల్ మండలం నాగర్‌దొడ్డి గ్రామానికి చెందిన ఐదుగురు బాలికలు వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లి నీట మునిగి చనిపోయారు. వీరిలో ముగ్గురు ఒకే కుంటుంబానికి చెందిన వారు కాగా.. మరో ఇద్దరు వారి స్నేహితులు. మృతులంతా 10 సంవత్సరాల వయస్సు లోపలివారే. మృతి చెందిన వారిలో చిన్నారి (10), మేఘన (12), వెంకటేశ్వరి (7), యు.చిన్నారి (7), కవిత(12) ఉన్నారు. వీరంతా ఈత కొడదామని వారి ఇంటి సమీపంలో ఉన్న ఓ వ్యవసాయ బావిలో దిగారని, కాగా అందులో నీరు ఎక్కువగా ఉండటంతో  ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు చెబుతున్నారు.

మొదట ప్రమాదవశాత్తు ఓ చిన్నారి నీట మునిగిపోగా.. ఆమెను రక్షించే ప్రయత్నంలో ఒకరి తర్వాత ఒకరు నీట మునిగిపోయినట్లు వారు తెలిపారు.  ఒకే రోజు ఐదుగురు బాలికలు చనిపోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల మృతితో కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి.