ఐదుగురు ఐటీబీపీ జ‌వాన్ల‌కు క‌రోనా పాజిటివ్.. 60 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌కు..

ఐదుగురు ఐటీబీపీ జ‌వాన్ల‌కు క‌రోనా పాజిటివ్.. 60 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌కు..

భార‌త్ ను కంటికి రెప్ప‌లా కాచుకుని ఉండే జ‌వాన్లు సైతం క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ సైనికుల‌కు ఈ వైర‌స్ సోకింది. తాజాగా ఇండో టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీస్ (ఐటీబీపీ) జ‌వాన్లు క‌రోనా బారిన‌ప‌డ్డారు. గ‌డిచిన రెండ్రోజుల్లో ఐదుగురు ఐటీబీపీ జవాన్ల‌కు వైర‌స్ సోకిందని అధికారులు తెలిపారు. దాదాపు 90 మందిని క్వారంటైన్ కు త‌ర‌లించిన‌ట్లు చెప్పారు.

ఢిల్లీలోని టిగ్రీ ఏరియాలో పోలీసుల‌తో క‌లిసి సెక్యూరిటీ డ్యూటీలో ఉన్న ముగ్గురు ఐటీబీపీ జ‌వాన్ల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. రెండ్రోజుల క్రితం ఐటీబీపీ 50వ బెటాలియ‌న్ కు చెందిన స‌బ్ ఇన్ స్పెక్ట‌ర్, హ‌డ్ కానిస్టేబుల్ కు క‌రోనా సోకింది. వారికి హ‌ర్యానాలోని ఝ‌జ్జ‌ర్ లో ఉన్న ఎయిమ్స్ హాస్పిట‌ల్ లో చికిత్స అందిస్తున్నారు.

సీఆర్పీఎఫ్ లో మ‌రో 12 కేసులు

సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే ఢిల్లీలో 48 మంది ఈ వైర‌స్ బారిన‌ప‌డగా.. తాజాగా మ‌రో 12 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని అధికారులు తెలిపారు. దీంతో మొత్తం 60 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌కు వైర‌స్ సోకింద‌ని చెప్పారు. వారంద‌రినీ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ (55) ఒక‌రు క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్లు తెలిపారు.