- 216 కొనుగోలు కేంద్రాలకు 60 కేంద్రాల్లో తూకాలు స్టార్ట్
- టార్గెట్ 1.95 లక్షల టన్నులు
- సేకరించిన ధాన్యం 6,796 టన్నులు మాత్రమే..
సంగారెడ్డి, వెలుగు: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు దోపిడీ కొనసాగుతోంది. రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 216 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిలో 188 కేంద్రాలు తెరిచి ఉంచినప్పటికీ శనివారం వరకు 60 కేంద్రాల్లో మాత్రమే తూకాలు స్టార్ట్ అయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ఈ తరుగు దోపిడీ మరింత నష్టపోయేలా చేస్తోంది. క్వింటాల్ బస్తా నుంచి 5 కిలోల వరకు తరుగు తీస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు.
దాదాపు అన్ని సెంటర్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇదేమిటని ప్రశ్నిస్తే అనేక కొర్రీలు పెడుతూ తూకాలు వేస్తలేరనే విమర్శలున్నాయి. ఇలాంటి దారుణాలపై ఫిర్యాదు చేస్తే అధికారులు పట్టించుకుంటలేరని బాధిత రైతులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి తూకాల్లో జరుగుతున్న అవకతవకలను నివారించాలని రైతులు కోరుతున్నారు.
టార్గెట్ 1.95 లక్షల టన్నులు
జిల్లాలో ఇప్పుడిప్పుడే ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వారం కింది వరకు వర్షాల కారణంగా ధాన్యం సేకరణ 100 టన్నులు కూడా దాటలేదు. కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యంతో రైతులు కన్నీరు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 1.95 లక్షల టన్నుల ధాన్యం సేకరించే లక్ష్యం ఉండగా శనివారం వరకు దాదాపు 6,796 టన్నుల ధాన్యం సేకరించినట్టు అధికారులు తెలిపారు.
సంగారెడ్డి, జిన్నారం, గుమ్మడిదల, జోగిపేట, వట్ పల్లి, హత్నూర, పుల్కల్, అందోల్ మండలాల పరిధిలోని సెంటర్లలో గడిచిన వారం రోజుల్లో తూకాలు జోరందుకున్నాయి. మిగతా మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో కొన్నిచోట్ల ధాన్యం రాకపోగా మరికొన్ని చోట్ల హమాలీల కొరత వల్ల తూకాలు మొదలుకాలేదు. బీహార్ రాష్ట్రానికి చెందిన హమాలీలు మన దగ్గర ఎక్కువగా పనిచేస్తుంటారు. అక్కడ ఎన్నికలు ఉండడంతో హమాలీలు సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఈ కారణంగా కొన్నిచోట్ల తూకాలు స్టార్ట్ చేయలేదు.
