- ఆదివారం ఒక్కరోజే 5 లక్షల మందికి పైగా రాక
- వాహనాలతో కిక్కిరిసిపోయిన వన దేవతల దారులు
తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తజనం భారీగా తరలి వస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే 5 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్టు ఈవో మేకల వీరస్వామి తెలిపారు. భక్తులు భారీగా తరలి రావడంతో పస్రా నుంచి మేడారం, తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఈ నెల 28 నుంచి 31 వరకు మహా జాతర జరగనుండగా, దాదాపు నెల రోజుల ముందు నుంచే మేడారానికి భక్తుల రాక మొదలైంది. గత 10 రోజులుగా భక్తుల సంఖ్య పెరిగింది.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సంక్రాంతి సెలవులు రావడంతో ఆదివారం మేడారానికి అశేష భక్తజనం తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి.. సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులకు పసుపు, కుంకుమ, బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో పోలీసులు గద్దెల చుట్టూ ఉన్న బ్రాస్ గేల్స్‌కు తాళాలు వేసి, బయటి నుంచే అమ్మవార్ల దర్శనాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ నెల 28 నుంచి 31 వరకు మహా జాతర ఉంటుంది. 28న సారలమ్మ, 29న సమ్మక్క గద్దెల మీదకు వస్తారు. తిరిగి 31న వనప్రవేశం చేస్తారు.
