IND v ENG: నాలుగో టెస్ట్ ముందు రోహిత్‌ను ఊరిస్తున్న ఐదు రికార్డులు

IND v ENG: నాలుగో టెస్ట్ ముందు రోహిత్‌ను ఊరిస్తున్న ఐదు రికార్డులు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డులు కొత్తేమీ కాదు. 16 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో రికార్డ్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫార్మాట్ ఏదైనా రికార్డులు హిట్ మ్యాన్ ఖాతాలోకి వచ్చి చేరతాయి. వన్డే, టీ20  క్రికెట్ తో పోల్చుకుంటే టెస్టుల్లో కొంచెం రికార్డ్స్ తక్కువగానే ఉన్నాయి. అయితే ఓపెనర్ గా మారిన తర్వాత రోహిత్ ఫామ్ నెక్స్ట్ లెవల్ ల్లో ఉంది. ఒకదాని తర్వాత మరొక రికార్డ్ సెట్ చేస్తున్నాడు. తాజగా.. రాంచీ టెస్టుకు ముందు రోహిత్ శర్మను ఐదు రికార్డులు ఊరిస్తున్నాయి.

టెస్టుల్లో రోహిత్ ఇప్పటివరకు 3977 పరుగులు చేశాడు. మరో 23 పరుగులు చేస్తే 4000 పరుగులు పూర్తి చేస్తాడు. మరో 37 పరుగులు చేస్తే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 9000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఇక టెస్టుల్లో కెప్టెన్‌గా 1000 పరుగుల మార్క్‌ను చేరుకోవడానికి 70 పరుగుల దూరంలో ఉన్నాడు. టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై 1000 పరుగులు పూర్తి చేయడానికి 13 పరుగుల దూరంలో నిలిచాడు. సిక్సర్లను కొట్టడంలో సిద్ధహస్తుడైన హిట్ మ్యాన్.. మరో 7 సిక్సులు బాదితే అంతర్జాతీయ క్రికెట్‌లో 600 సిక్సులు కొట్టిన అరుదైన లిస్ట్ లో చేరతాడు.

ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్ లో రోహిత్ శర్మ ఒక సెంచరీ మినహా పెద్దగా రాణించింది ఏమీ లేదు. తొలి రెండు టెస్టుల్లో కనీసం హాఫ్ సెంచరీ మార్క్ చేరుకోలేకపోయిన హిట్ మ్యాన్.. రాజ్ కోట్ టెస్టులో 131 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇదిలా ఉంటే..  భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే మూడు టెస్టులు ముగిశాయి. హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓడిపోయింది. ఆ తర్వాత వరుసగా వైజాగ్, రాజ్ కోట్ టెస్టుల్లో గెలిచి సిరీస్ లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం ఇరు జట్లు నాలుగో టెస్టు మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నాయి. రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు నాలుగో టెస్ట్ జరుగుతుంది.