5 వేల మంది డూప్లికేట్‌‌‌‌ ఉద్యోగులు.. కాంట్రాక్ట్‌‌‌‌, ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌లో బయటపడ్డ బాగోతం

5 వేల మంది డూప్లికేట్‌‌‌‌ ఉద్యోగులు.. కాంట్రాక్ట్‌‌‌‌, ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌లో బయటపడ్డ బాగోతం
  • ప్రతి నెలా శాలరీల పేరిట రూ.25 కోట్లు లూటీ
  • ఆధార్‌‌‌‌‌‌‌‌ కార్డు వివరాలు తీసుకోవడంతో వెలుగుచూసిన ఉద్యోగాల మాఫియా 
  • ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా గుర్తించని గత సర్కారు
  • ఉద్యోగ వ్యవస్థను ఇక పూర్తిగా స్ట్రీమ్‌‌‌‌లైన్‌‌‌‌ చేసేలా డిజిటల్‌‌‌‌ మానిటరింగ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్‌‌‌‌ సోర్సింగ్ ఉద్యోగాల మాఫియాను ఆర్థిక శాఖ బయటపెట్టింది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను.. ఆధార్ కార్డుతో లింక్‌‌‌‌ చేయడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. కాంట్రాక్ట్‌‌‌‌, ఔట్​సోర్సింగ్‌‌‌‌లో ఏకంగా 5 వేల మందికి పైగా డూప్లికేట్ ఉద్యోగులు ఉన్నట్టు తేలింది. అసలు అక్కడ ఉద్యోగులే లేకుండా పేర్లు సృష్టించడం ఒక ఎత్తు అయితే, ఒకే వ్యక్తి పేరుతో రెండు, మూడు చోట్ల జీతాలు తీసుకుంటున్న విషయం బయటపడింది.  ప్రభుత్వంలో పర్మినెంట్ ఉద్యోగం చేస్తున్న వారు సైతం ఔట్‌‌‌‌ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా తాత్కాలిక ఉద్యోగులుగా నమోదైనట్టు అధికారులు గుర్తించారు. 

కొన్ని ఏజెన్సీలు, ఆయా శాఖల్లోని కొందరు అవినీతి అధికారుల అండదండలతో ఈ దందా సాగిస్తున్నట్లు స్పష్టమవుతున్నది.  ప్రాథమిక అంచనాల ప్రకారం.. కేవలం ఈ బోగస్ ఉద్యోగుల జీతాల పేరిట ప్రతినెలా దాదాపు రూ.25 కోట్లు పక్కదారి పడుతున్నట్లు సమా చారం.  అంటే ఏడాదికి సుమారు రూ.250 కోట్ల ప్రజల సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తున్నది. ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా గత సర్కారు హయాంలో ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం. 

కాగా, కేవలం కాగితాల మీద లెక్కలు చూపిస్తూ.. క్షేత్రస్థాయిలో లేని సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్న విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్​ ప్రభుత్వం సీరియస్‌‌‌‌ అయింది. వెంటనే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.  

అన్ని స్థాయిల్లోనూ ఔట్ ​సోర్సింగ్‌‌‌‌ వ్యవస్థ

రాష్ట్రంలో 5,21,692 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా, వారికి సమానంగా అంటే 5 లక్షల మందికి పైగా కాంట్రాక్ట్, ఔట్‌‌‌‌ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. అంటే ప్రభుత్వం తన పాలనాపరమైన అవసరాల కోసం సగానికి సగం తాత్కాలిక సిబ్బందిపైనే ఆధారపడుతున్నది. రాష్ట్రంలోని మొత్తం 31 ప్రభుత్వ శాఖలను పరిశీలిస్తే.. అందులో 9 శాఖల్లో పర్మినెంట్ ఉద్యోగుల కంటే ఔట్‌‌‌‌ సోర్సింగ్ సిబ్బందే అధికంగా ఉన్నారు. ప్రజలకు నేరుగా సేవలు అందించాల్సిన కీలక విభాగాల్లోనే ఈ పరిస్థితి ఉన్నది. ఈ శాఖల్లోనే ఎక్కువగా అవకతవకలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

రెగ్యులర్ సిబ్బంది కొరతను సాకుగా చూపి, ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా పేర్లను నమోదు చేసి.. బిల్లులు పెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఏజెన్సీల పనితీరుపై, నియామక ప్రక్రియపై సరైన పర్యవేక్షణ లేకపోవడమే ఈ భారీ కుంభకోణానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. అందుకే ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నది.  డూప్లికేట్ ఉద్యోగులను ఏరివేయడంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు తావులేకుండా ఉద్యోగ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. 

ఇకపై జీతాల చెల్లింపులో మాన్యువల్ విధానానికి స్వస్తి పలికి, పూర్తిస్థాయిలో ‘డిజిటల్ మానిటరింగ్’ విధానాన్ని అమల్లోకి తేనున్నది. ప్రతీ కాంట్రాక్ట్, ఔట్‌‌‌‌ సోర్సింగ్ ఉద్యోగి వివరాలను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నమోదు చేయడంతోపాటు బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే వేతనాలు చెల్లించేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఈ చర్యలతో ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు ఆదా కావడంతోపాటు అర్హులైన వారికి న్యాయం జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.