
- 20 ఏళ్లలో కారుణ్యం కింద 5 వేల మంది అనర్హుల నియామకం
- బ్యాన్ టైంలో రిక్రూట్ అయిన మరో 1,163 మంది
- ఇప్పుడు ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్న వీఆర్‌ఏలు
- వీరిని ఏరివేయాలనివివరాలడిగిన చీఫ్ కమిషనర్
- గతంలో పలు మార్లు అడిగినా డేటా పంపని తహసీల్దార్లు
హైదరాబాద్, వెలుగు: బ్యాన్ పిరియడ్‌లో రిక్రూట్‌అయిన వీఆర్‌ఏలపై సీసీఎల్‌ఏ అధికారులు మరోసారి దృష్టి పెట్టారు. ఈ నెల 13 వరకు వారి వివరాలన్నీ తమకు పంపాలని కలెక్టర్ల ద్వారా తహసీల్దార్లకు ఆర్డర్స్ వేశారు. ఇదే డేటాను 2012లో సీసీఎల్‌ఏ చీఫ్ కమిషనర్ కోరితే కేవలం హైదరాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచే వచ్చింది. దీంతో ఈ సారైనా తహసీల్దార్లు కచ్చితమైన డేటా పంపుతారో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దొడ్డిదారిన ఉద్యోగంలోకి
రాష్ట్రంలో సుమారు 21 వేల వీఆర్‌ఏ పోస్టులుండగా 20 వేల పోస్టుల్లో వీఆర్ఏలు డ్యూటీలు చేస్తున్నారు. వీరిలో 17 వేల మంది కారుణ్య నియామకాలతో ఉద్యోగంలోకి వచ్చినట్టు సమాచారం. 2012, 2014లో ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 3 వేల పోస్టులను భర్తీ చేయగా మరో వెయ్యి ఖాళీగా ఉన్నాయి. వాస్తవానికి వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న వారు చనిపోతే కారుణ్య నియామకం కింద వారి స్థానంలో వారసులను అదే విలేజ్‌లో నియమించాలి. వారసుల్లేకపోతే ఆ పోస్టు ఖాళీ అయినట్టే. దీనిపై 1993లోనే జీఓ వచ్చింది. అయినా కొందరు తహసీల్దార్లు మామూళ్లు తీసుకుని వారసుల్లేని చోట ఇతరులను నింపేశారు. ఇలా 20 ఏళ్లలో 5 వేల మంది వీఆర్‌ఏలుగా నియామకమైనట్టు సమాచారం. కొందరు రిటైర్డ్ కాకముందే ఉద్యోగం నుంచి తప్పుకొని తహసీల్దార్ల సాయంతో తమ వారసులను కారుణ్య పద్ధతిలో నియమించారు. ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం ప్రకారం 2004 నవంబరు 1 నుంచి 2011 అక్టోబరు వరకు నియామకాలు చేపట్టవద్దని ప్రభుత్వం ‘బ్యాన్ పిరియడ్’ ప్రకటించింది. ఆ సమయంలోనూ రాష్ట్రంలో తహసీల్దార్లు 1,163 మందిని వీఆర్‌ఏలుగా నియమించినట్లు తెలిసింది. వీటినీ కారుణ్య నియామకాలుగానే ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలిసింది.
ప్రమోషన్ల కోసం కోర్టుకు..
అడ్డదారిలో చేరిన వీఆర్‌ఏలు ఇప్పుడు వీఆర్‌ఓలుగా ప్రమోషన్ల కోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జూన్ 2018 లో 80 మంది వీఆర్ఏలకు వీఆర్వోలుగా ప్రమోషన్ ఇవ్వగా, వారిలో అండర్ ఏజ్, గ్రాండ్ సన్, దత్తత, మెడికల్ గ్రౌండ్‌లో ఉద్యోగంలో చేరిన వీఆర్‌ఏలే 33 మంది. అయితే వీరి ప్రమోషన్లపై డైరెక్ట్ రిక్రూట్ వీఆర్‌ఏలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా ఆ ప్రక్రియ ఆగింది. దీంతోవారు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు వారికి అనుకూలంగా ఉత్తర్వులిచ్చినట్టు తెలిసింది.