50 కాలనీలు ఒక్కటై.. పొల్యూషన్​పై ఫైట్​

50 కాలనీలు ఒక్కటై.. పొల్యూషన్​పై ఫైట్​
  • సిటీలోని ఇండస్ట్రియల్ ఏరియాల్లో జనాల అవస్థలు

“ మా కాలనీలో ఫ్యాక్టరీలు రిలీజ్ చేసే పొల్యూషన్​పై పదేండ్ల నుంచి ఫైట్ చేస్తున్నా నో రిజల్ట్. ఫ్యాక్టరీల నుంచి  వచ్చే ఘాటైన  వాసనలతో ఊపిరి పీల్చుకోలేకపోతున్నాం. ఇండ్లలో ఉండలేకపోతున్నాం. ఈ ప్రాబ్లమ్ పై పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కి ఫోన్ కాల్స్, వెబ్ సైట్ ఇలా అన్ని రకాలుగా కంప్లయింట్లు చేసినా పరిష్కారం చూపలేదు.  అందుకే మా ఏరియాతో పాటు మరికొన్ని ప్రాంతాలకు చెందిన వారితో గ్రూప్ గా ఏర్పడ్డాం. అందరం కలిసి రాస్తారోకోలు కూడా చేశాం. ఇంకెన్నాళ్లు ఇలా బతకాలో అర్థం కావడం లేదు. ఊపిరిత్తిత్తుల్లో నొప్పిగా ఉండి,  కళ్లు ఎర్రగా అవుతున్నయ్.” ఇది మదీనాగూడకి చెందిన నందకిషోర్ ఆవేదన.

హైదరాబాద్, వెలుగు: ఏండ్లు గడుస్తున్నా ఇండస్ట్రియల్​ఏరియాల సమీపంలోని కాలనీల జనాలకు శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. కెమికల్ ఫ్యాక్టరీల నుంచి రిలీజ్ అయ్యే గ్యాస్ (ఘాటైన వాసన) కారణంగా గాలి పూర్తిగా పొల్యూషన్​అవుతుండడమే కాకుండా, ఉదయం, రాత్రి వేళ్లలో కంపెనీల నుంచి వెలువడే గ్యాస్​తో ఊపిరి పీల్చుకోలేనంతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నాపెద్దా అందరూ బాధితులే. అనారోగ్యాలకు గురవుతున్నవారే. ఈ ప్రాబ్లమ్​పై పొల్యూషన్ కంట్రోల్​బోర్డు (పీసీబీ) కు కంప్లయింట్లు చేస్తూనే ఉన్నా ఎలాంటి స్పందన ఉండడం లేదు.  అయితే ఒక్క కాలనీకి చెందిన వారే కాదు. వెస్ట్ సిటీలోని బాచుపల్లి నుంచి గచ్చిబౌలి వరకు 50 గేటెడ్ కమ్యూనిటీల జనాలు ఫెడరేషన్ గా ఏర్పడి పీసీబీకి కంప్లయింట్లు చేస్తున్నారు. 
పొల్యూషన్​పై ఐక్యంగా పోరాడుతున్నారు.  బాచుపల్లి, నిజాంపేట, కేపీహెచ్‌‌‌‌‌‌‌‌బీ ఏరియాల నుంచి గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల వరకు జనాలు పదేండ్లుగా ఫ్యాక్టరీల నుంచి వెలువడే గ్యాస్​తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొల్యూషన్​ కంట్రోల్ బోర్డుకు కంప్లయింట్లు చేస్తూనే ఉన్నారు. అధికారుల నుంచి సరైన స్పందన లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ​ఎదుర్కొంటున్న వారంతా కలిసి ఒక గ్రూప్​గా ఏర్పడ్డారు. ప్రస్తుతం వాట్సాప్ గ్రూప్ లు, ఫెడరేషన్ల ద్వారా ఐక్యంగా ఫైట్​చేస్తున్నారు.  2014 బాచుపల్లి జంక్షన్ లో ఎయిర్ పొల్యూషన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో స్టార్ట్​ చేశారు. అప్పట్లో అధికారులు స్పందించి పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీలను ఇండెక్స్ లను ఏర్పాటు చేశారు.  పీసీబీ అధికారులు వచ్చి తనిఖీలు చేసేటప్పుడు ఎలాంటి వాసన రాకుండా పరిశ్రమల మేనేజ్​మెంట్లు జాగ్రత్త పడుతుండగా, మామూలు రోజుల్లో భరించలేనంతగా వానస వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిరోజుల కిందట సిటీలోని 15 కాలనీలు, అపార్ట్​మెంట్​వాసులు ఒక్కటిగా ఉద్యమం మొదలు పెట్టగా ఇప్పుడు 50 కమ్యూనిటీల వాసులు కలిసి ఫైట్ చేస్తున్నారు. 
చాలా మంది ఇండ్లు ఖాళీ..
ఫ్యాక్టరీల నుంచి వెలువడే గ్యాస్​ని పీల్చుకోవడం ద్వారా తీవ్రమైన తలనొప్పి, సైనస్, కంటి సమస్యలు, వీక్​నెస్ లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్​ వస్తున్నాయని బాధితులు చెప్తున్నారు. చాలామంది ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నామంటున్నారు. చర్మ వ్యాధులు, అలర్జీలు, వాంతులు వంటివి అవుతాయని పేర్కొంటున్నారు. వృద్ధులు శ్వాస తీసుకోవడంతో తీవ్ర​అవస్థలు పడుతున్నారంటున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్​ ఉంటుండగా ఇప్పటికే చాలామంది  ఇండ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారంటున్నారు. అక్కడే ఉంటున్న వారు సాయంత్రమైతే బయటకు రాలేక, కిటికీలు, తలుపులు మూసుకొని ఉంటున్నామంటున్నారు. అయినా ఘాటు వాసనల నుంచి తప్పించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిశ్రమలను తొలగిస్తేనే..
జీడిమెట్ల, నాచారం, ఉప్పల్,  పాశమైలారం, మల్లాపూర్, గడ్డి పోచారం, కుత్బుల్లాపూర్, చర్లపల్లి, గాజుల రామారం, కూకట్​పల్లి, బాచుపల్లి, పటాన్‌‌‌‌‌‌‌‌చెరు ఏరియాల్లో ఫార్మసీ బల్క్ డ్రగ్ , కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటి నుంచి వెలువడే పొగలో గాలిలోని ధూళికణాల శాతం అధికంగా ఉండడం వల్ల పీల్చుకున్న వారు తీవ్ర అనారోగ్యాల బారిన పడతారని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. ఇండస్ట్రియల్ ఏరియాల్లోని స్థానికులు కోర్టులకు కూడా వెళ్లారని, అయినా పరిష్కారం దొరకలేదని పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి అంటున్నారు. బస్తీల్లో ఉండేవారు తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్నారని, పరిశ్రమలను తొలగిస్తేనే శాశ్వత పరిష్కారం ఉంటుందని పేర్కొంటున్నారు. 


అర్ధరాత్రి వదిలే గ్యాస్​ కారణంగా..
 ఐదేండ్లుగా గచ్చిబౌలిలోని గేటెడ్ కమ్యూనిటీ సెరెన్ కౌంటీలో ఉంటున్నాం. ఐదువేల మంది నివసిస్తుండగా ఎక్కువమంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు వారంతా వర్క్ ఫ్రమ్ హోంలో ఉండగా, యూఎస్ మీటింగ్ రాత్రిళ్లు అవుతుంటాయి. అర్ధరాత్రి11 గంటల తర్వాత రిలీజ్ అయ్యే ఫ్యాక్టరీల గ్యాస్ తో ఇబ్బందులు పడుతుండమే కాకుండా బ్రీతింగ్ ప్రాబ్లమ్, వాంతులు అయ్యేలా అనిపిస్తోంది.
- రమేశ్, ప్రెసిడెంట్, సెరెన్ కౌంటీ, గచ్చిబౌలి 

కేసులు పెరిగినయ్​
 రెండేళ్లుగా ఊపిరి తిత్తుల ప్రాబ్లమ్స్​పేషెంట్ల కేసులు పెరుగుతున్నయ్​. ఇవి ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్​ ఏరియాల నుంచే ఉంటున్నయ్​. లంగ్స్​ ఇన్​ఫెక్షన్స్​, అలర్జీ , స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, నోస్ (ఇన్ఎన్‌‌‌‌‌‌‌‌టీ) ప్రాబ్లమ్స్​ ఉన్న పేషెంట్లకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాం.
- డాక్టర్ రఘుకాంత్, పల్మనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్