
టీమిండియా టెస్ట్, వన్డే కెప్టెన్ శుభమాన్ గిల్ ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో మోస్ట్ బిజీ ప్లేయర్ గా మారుతున్నాడు. ఈ ఏడాది టీమిండియా టెస్ట్, వన్డే పగ్గాలు గిల్ కు అప్పగించిన బీసీసీఐ.. ఈ యువ బ్యాటర్ కు పెద్ద బాధ్యతను అప్పజెప్పింది. మూడు ఫార్మాట్ లు ఆడాల్సి రావడంతో గిల్ కు కష్టంగా మారుతుంది. రెస్ట్ లేకుండానే మూడు ఫార్మాట్ లు ఆడుతున్నాడు. మంగళవారం (అక్టోబర్ 14) వెస్టిండీస్ తో టీమిండియా టెస్ట్ మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా వన్డే, టీ20 సిరీస్ కోసం బుధవారం (అక్టోబర్ 15) ఆస్ట్రేలియా పయనం కానుంది. కనీసం గిల్ ఇంటికి వెళ్లే సమయం కూడా బీసీసీఐ ఇవ్వడం లేదు.
ప్రస్తుతం టీమిండియాలో మూడు ఫార్మాట్ లు ఆడుతున్న లిస్ట్ చూస్తే వారిలో ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కాగా.. మరొకరు టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఉన్నప్పటికీ వీరిని విదేశీ టెస్టుల్లో ఆడే ఛాన్స్ తక్కువ. వర్క్ లోడ్ కారణంగా బుమ్రాకు రెస్ట్ ఇస్తారు. అయితే గిల్ కెప్టెన్ కావడంతో మూడు ఫార్మాట్ లు ఆడాల్సిందే. అన్ని ఫార్మాట్ లు ఆడడం గిల్ కు కాస్త ఇబ్బంది కలిగించే విషయమే. ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరిగింది. వైస్ కెప్టెన్ గా గిల్ ఈ టోర్నీలో ఆడాడు. ఆ తర్వాత రెండు రోజుల గ్యాప్ లో అక్టోబర్ 2 నుంచి 14 వరకు ఇండియాలో వెస్టిండీస్ పై రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడాడు.
సెప్టెంబర్ 28 న ఫైనల్ మ్యాచ్ ఆడితే 29న దుబాయి నుంచి ఇండియాకు చేరుకున్నాడు. 30న అహ్మదాబాద్ చేరుకొని.. అక్టోబర్ 1న టెస్ట్ సిరీస్ కు సిద్దమయ్యాడు. అక్టోబర్ 2న వెస్టిండీస్ తో తొలి మ్యాచ్ ఆడాడు. గిల్ తో పాటు కుల్దీప్ యాదవ్, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా ఇదే పరిస్థితి. అయితే బుమ్రాకు వన్డే సిరీస్ లో రెస్ట్ ఇచ్చారు. అంతకముందు ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కుల్దీప్ యాదవ్ కు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే గిల్ మాత్రం మూడు ఫార్మాట్ లలో ప్రతి మ్యాచ్ ఆడుతూ వస్తున్నాడు. 26 ఏళ్ళ వయసులో గిల్ ఇండియన్ క్రికెట్ బాధ్యతలు ఎలా మోస్తాడో చూడాలి.
భారత క్రికెట్ లో గిల్ వేగంగా దూసుకెళ్తున్నాడు. కోహ్లీ తర్వాత ఈ యువ బ్యాటర్ శకం మొదలైనట్టే కనిపిస్తోంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో కెప్టెన్ గా, బ్యాటర్ గా గిల్ అద్భుతంగా రాణించాడు. ఫ్యూచర్ లో అన్ని ఫార్మాట్లకు గిల్ కెప్టెన్ అని స్పష్టంగా తెలుస్తోంది. ఆసియా కప్ టీ20 జట్టుకు వైస్ కెప్టెన్ గా ప్రకటించడం., ఆతర్వాత వన్డే సిరీస్ కు కెప్టెన్ గా నియమించడంతో ఒక్కసారిగా గిల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు. ప్రస్తుతం టెస్టుల్లో కెప్టెన్ గా, బ్యాటర్ గా రాణిస్తున్న గిల్.. వన్డేల్లో తొలిసారి సారధ్య బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు.