
జగిత్యాల జిల్లా: మా నాన్నను చంపేశారు.. భూమి లాక్కున్నారు... మా భూమి మాకు ఇప్పించండి.. జగిత్యాల జిల్లాలో జరిగిన ప్రజావాణిలో ఇద్దరు చిన్నారుల ఆవేదన ఇది. కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామానికి చెందిన కోటే లాస్య తన ఇద్దరు పిల్లలతో కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. గతంలో తమ తండ్రిని భూ వివాదాలతో తాత, బాబాయ్ కలిసి హత్య చేశారని ప్రజావాణిలో కలెక్టర్కు కోటే లాస్య పిల్లలు ఇద్దరూ మొరపెట్టుకున్నారు.
చిన్నారుల నాన్న పేరుపై ఉన్న ఐదు ఎకరాల భూమిని, ఇంటిని లాక్కొని బయటకు గెంటేశారని ప్రజావాణిలో బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. తమ భూమి తమకు కావాలని అడిగితే చంపేస్తామంటూ దాడి చేస్తున్నారని బాధిత కుటుంబం కన్నీరుమున్నీరయింది.
పంట పొలం మీద కోర్టులో కేసు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమ భూమి తమకు ఇప్పించి న్యాయం చేయాలని బాధిత కుటుంబం ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. పిల్లల భవిష్యత్తు కోసం తనకు ఏదైనా ఉపాధి కల్పిస్తే రుణపడి ఉంటానని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించి, కోట లాస్య కన్నీటి పర్యంతం అయింది.