Venkatesh: 'సంక్రాంతికి వస్తున్నాం' హిందీ రీమేక్.. వెంకీ ప్లేస్‌లో బాలీవుడ్ స్టార్ హీరో!

Venkatesh: 'సంక్రాంతికి వస్తున్నాం' హిందీ రీమేక్.. వెంకీ ప్లేస్‌లో బాలీవుడ్ స్టార్ హీరో!

ఈ ఏడాది (2025 ) సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన బ్లాక్ బస్టర్ తెలుగు చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం.'  విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కలిసి నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.  అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న ఈ కామెడీ ఎంటర్ టైనర్ .. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతటి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు బాలీవుడ్ లో అరంగేట్రం చేసేందుకు సిద్దమైంది.

వెంకటేష్ పాత్రలో అక్షయ్ కుమార్!

అయితే ఈ 'సంక్రాంతికి వస్తున్నాం' హిందీ రీమేక్ లో వెంకటేష్ పోషించిన రిటైర్ట్ పోలీస్ ఆఫీసర్ యాదగిరి దామోదర రాజు పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించబోతున్నారని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.  సౌత్ సినిమాలను రీమేక్ చేయడంలో అక్షయ్ కుమార్ పేరుగాంచినప్పటికీ.. గత కొంతకాలంగా ఆయనకు సరైన హిట్ దక్కలేదు. ఈ నేపథ్యంలోనే.. తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రంపై ఆయన ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. 

నిర్మాతగా దిల్ రాజు.. 

ఈ 'సంక్రాంతికి వస్తున్నాం' తెలుగు చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన దిల్ రాజు.. హిందీలో రీమెక్ ను కూడా ఒక ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించనున్నట్లు సమాచారం. గతంలో కూడా దిల్ రాజు తెలుగు సినిమాలైన జెర్సీ, హిట్ : దిఫస్ట్ కేస్ వంటి వాటిని హిందీలో నిర్మించారు.  ఇప్పుడు తన సొంత బ్లాక్ బస్టర్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు రెడీ అయ్యారు.  మరో వైపు ఈ హిందీ రీమేక్‌కు దర్శకత్వం వహించే బాధ్యతలను బాలీవుడ్‌లో 'వెల్‌కమ్', 'నో ఎంట్రీ', 'భూల్ భులయ్యా' వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు అనీస్ బాజ్మీకి అప్పగించినట్లు సమాచారం. అయితే తన కామెడీ టైమింగ్‌తో అనీస్ బాజ్మీ ఈ కథను హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్చే అవకాశం ఉంది.

 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్.. 

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రానికి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు గతంలో అనిల్ రావిపూడి ప్రకటించారు. అయితే, ఇప్పుడు సీక్వెల్‌కు ముందే ఈ సినిమా హిందీ రీమేక్ చేయనుండటంతో సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన నటించే ఇద్దరు కథనాయికలు , ఇతర నటీనటుల ఎంపికపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరి, తెలుగులో వెంకటేష్‌ తన కామెడీ, యాక్షన్ టైమింగ్‌తో పండించిన మాజిక్‌ను అక్షయ్ కుమార్ , అనీస్ బాజ్మీ జోడీ బాలీవుడ్‌లో ఎంతవరకు రిపీట్ చేస్తారో చూడాలి.