ప్రధాని మోడీ మరో రికార్డు.. ఒకేరోజు 50 కిలోమీటర్ల మెగా రోడ్​ షో

ప్రధాని మోడీ మరో రికార్డు.. ఒకేరోజు 50 కిలోమీటర్ల మెగా రోడ్​ షో

ప్రధాని మోడీ దేశ రాజకీయ చరిత్రలో మరో సరికొత్త రికార్డు సృష్టించారు. దేశంలో సుదీర్ఘ రోడ్‌ షో నిర్వహించిన నేతగా మరో ఘనతను సొంతం చేసుకున్నారు. గుజరాత్ లో ఈనెల 5న రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న  ప్రాంతాలే లక్ష్యంగా.. 16 నియోజకవర్గాల్లోని ఏకంగా 50 కిలోమీటర్లు కవర్​ చేసేలా ప్రధాని మోడీ ఒకేరోజు మెగా రోడ్ షో నిర్వహించారు. దాదాపు ఆరుగంటల పాటు అహ్మదాబాద్ సిటీలో మోడీ రోడ్ షో కొనసాగింది. రోడ్డుకు ఇరువైపులా బీజేపీ శ్రేణులు, స్థానికులు నిలబడి పూలు చల్లుతూ ప్రధానిమోడీకి ఘనస్వాగతం పలికారు. ర్యాలీలో భాగంగా సర్దార్​ వల్లభాయ్ పటేల్ విగ్రహం దగ్గర మోడీ పుష్పాంజలి అర్పించారు. మధ్యలో తన కాన్వాయ్ ఆపి.. ఒక అంబులెన్స్ కు దారి ఇచ్చారు ప్రధాని.

గురువారం సాయంత్రం  నరోడాగామ్‌ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ తన రోడ్‌షోను మొదలు పెట్టారు. అక్కడి నుంచి టక్కర్‌బాపానగర్, బాపునగర్, నికోల్, అమ్రైవాడి, మణినగర్, డానిలింబ్డా, జమాల్‌పూర్ ఖాడియా, ఎలిస్‌బ్రిడ్జ్, వెజల్‌పూర్, ఘట్లోడియా, నారన్‌పూర్, సబర్మతి తదితర నియోజకవర్గాల మీదుగా కొనసాగి గాంధీనగర్‌ సౌత్‌లో మెగా రోడ్‌షో ముగిసింది. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఓపెన్‌ టాప్‌ జీప్‌లో ఉన్న ప్రధాని మోదీ అభివాదం చేస్తూ ప్రజల్ని ఉత్సాహపరిచారు. ఈ రోడ్‌షోలో ప్రధాని దాదాపు 35 చోట్ల ఆగారు. గుజరాత్‌ ఎన్నికల వేళ ప్రధాని  మోదీ ఇప్పటివరకు 20 ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించారు. డిసెంబర్‌ 5న 93 స్థానాలకు జరిగే రెండో దశ ఎన్నికలకుగాను మరో ఏడు ర్యాలీల్లో మోడీ పాల్గొనాల్సి ఉంది.