గ్రేటర్ పరిధిలో 50 వేల వినాయక విగ్రహాలు నిమజ్జనం

గ్రేటర్ పరిధిలో 50 వేల వినాయక విగ్రహాలు నిమజ్జనం
  • కిక్కిరిసిన హుస్సేన్​సాగర్​ పరిసరాలు
  • మధ్యాహ్నం ఖైరతాబాద్​ మహా గణపతి నిమజ్జనం
  • బాలాపూర్  లడ్డూకు రూ. 18.90 లక్షల రికార్డు ధర
  • మైహోం భుజ వెంచర్​లో లడ్డూకు రూ. 18.50 లక్షలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వినాయక శోభాయాత్రలు, నిమజ్జనాలు సంబురంగా జరిగాయి.  గ్రేటర్  హైదరాబాద్​ పరిధిలో 50 వేల వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగింది. గ్రేటర్​లో 33 చెరువులు, 25 పాండ్స్ వద్ద ఈ కార్యక్రమం కొనసాగింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనంపై ఉత్కంఠ వీడటంతో పెద్ద ఎత్తున విగ్రహాలు ట్యాంక్​బండ్​కు చేరుకున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు హైదరాబాద్​లో ఎక్కడ చూసినా శోభాయాత్రలే కనిపించాయి.  కాలనీలు, బస్తీలు, అపార్టుమెంట్లలో ఏర్పాటు చేసిన గణపయ్య విగ్రహాలను పోలీసుల నిబంధనల ప్రకారమే నిమజ్జనం చేశారు. చాలా చోట్ల వర్షం పడినప్పటికీ భక్తులు శోభాయాత్రల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.  

మంత్రుల ఏరియల్ వ్యూ

గ్రేటర్ వ్యాప్తంగా చేపట్టిన నిమజ్జనాన్ని మంత్రులు తలసాని, మహమూద్ ఆలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ నుంచి ట్రాఫిక్ నియంత్రణ, వెహికల్ మూమెంట్ తోపాటు, ట్యాంక్ బండ్ పై జనాల రద్దీని అన్ని విభాగాలతో ఏర్పాటు చేసిన యాక్షన్ టీం పర్యవేక్షించింది. హుస్సేన్​సాగర్​లో నిమజ్జన ఏర్పాట్లను జీహెచ్​ఎంసీ మేయర్  గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పర్యవేక్షించారు. 

ప్రత్యేక ఆకర్షణగా సార్వజనిక రథం

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో  సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో సార్వజనిక శోభాయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సార్వజనిక రథాన్ని ఎడ్లతోపాటు వేలాది మంది భక్తులు లాగుతూ వినాయకుల బావి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వినాయక విగ్రహ నిమజ్జనం చేపట్టారు. పాలమూరులో జరిగిన శోభాయాత్రలో మంత్రి శ్రీనివాస్​గౌడ్​ పాల్గొని డ్యాన్స్​ చేశారు. కరీంనగర్​,  ఖమ్మం, నిర్మల్​ తదితర పట్టణాల్లో శోభాయాత్రలు ఘనంగా సాగాయి.