రాష్ట్రానికి రావాల్సిన 5 వేల కోట్లు చెల్లించాలి

రాష్ట్రానికి రావాల్సిన 5 వేల కోట్లు చెల్లించాలి

జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో హరీష్ రావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాలు జీఎస్టీలో చేరడం వల్ల ఆదాయం కోల్పోయాయని, ఈ మేరకు కేంద్రం జీఎస్టీ పరిహారం చెల్లించాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 41వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర డిమాండ్లను హరీశ్‌‌‌‌‌‌‌‌రావు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణకు రావాల్సి న రూ.5,420 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. జీఎస్టీ పరిహారంలో సెస్ మిగిలితే కేంద్రం కన్సాలిడేటెడ్ ఫండ్‌‌‌‌‌‌‌‌లో జమ చేసి వాడుకుంటోందని.. కానీ సెస్ తగ్గినప్పుడు రాష్ట్రాలు అప్పు తీసుకోవాలనడం సరికాదన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రం రూ.18 ,082 కోట్లు సెస్ రూపంలో కేంద్రానికి చెల్లిస్తే.. కేవలం రూ.3,223 కోట్లు మాత్రమే తీసుకుందన్నారు. 15వ ఆర్థిక సంఘం కేటాయింపుల్లోనూ రాష్ట్రానికి నష్టం జరిగిందన్నారు. ఐజీఎస్టీ సబ్ కమిటీ సమావేశమై, తెలంగాణకు రావాల్సిన రూ.2,700 కోట్లను త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రాలకు కేంద్రం ప్రపోజల్స్..

రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకున్న జీఎస్టీ కౌన్సిల్ రెండు ప్రపోజల్స్ రాష్ట్రాల ముందుంచింది. మొదటి ప్రతిపాదన కేంద్రమే రుణం తీసుకొని రాష్ట్రాలకు ఇవ్వడం, కేవలం జీఎస్టీ అమలులో ఏర్పడిన రెవెన్యూ లోటు లక్షా 65 వేల కోట్లు రాష్ట్రాలకు చెల్లించడం. రెండోది జీఎస్టీ, కరోనా కారణాల వల్ల ఏర్పడిన రెవెన్యూ లోటు 3 లక్షల కోట్లను రాష్ట్రాల పేరు మీద జీఎస్టీ కౌన్సిల్ తీసుకొని వడ్డీతో సహా రుణాన్ని చెల్లించడం. వీటిపై వారం లోగా అభిప్రాయాలను తెలియజేయాలని రాష్ట్రాలను కోరింది. వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ సోమేశ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.