- టెక్బయో అన్లీష్డ్ థీమ్‌తో రెండ్రోజులపాటు నిర్వహణ
- లైఫ్సైన్సెస్లో మరిన్ని పెట్టుబడులు సాధించేలా వ్యూహాలు
హైదరాబాద్, వెలుగు: బయో ఏషియా 23వ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. హైటెక్స్‌లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు మంగళవారం ప్రారంభం కానుంది. టెక్బయో అన్లీష్డ్ అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఈ ఏడాది 3 వేల మంది దాకా విదేశీ ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సదస్సును ప్రారంభించనున్నారు. నిరుడితో పోలిస్తే ఈ ఏడాది హైటెక్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన విశాలమైన స్పేస్‌లో కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
అంతర్జాతీయ డెలిగేట్స్, ఇన్వెస్టర్లు, స్టార్టప్‌లు, విదేశీ లైఫ్‌సైన్సెస్ సంస్థల నుంచి ప్రతినిధులు ఎక్కువ మంది వస్తుండడం.. డిమాండ్ ఎక్కువగా రావడంతో ఈసారి ఎక్కువ స్పేస్‌లో సదస్సును నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. ప్రపంచ వేదికపై తెలంగాణను గ్లోబల్ టెక్బయో పవర్హౌస్లా నిలిపేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. గత కొన్నేండ్లలో హైదరాబాద్ ఫార్మా, బయోటెక్ జీసీసీలకు గమ్యస్థానంగా నిలుస్తున్నది.
వ్యాక్సిన్మాన్యుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ప్రభుత్వం పటిష్టం చేసింది. బయోప్రాసెస్ డిజైన్, అడ్వాన్స్డ్ థెరపీ, ఏఐ ఆధారిత హెల్త్‌కేర్ రంగాల్లో కొత్త పెట్టుబడులు వస్తున్నాయి. ఈ ఏడాది కూడా ఆయా రంగాల్లో పెట్టుబడులు మరిన్ని సమకూర్చుకునేల ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తున్నది.
డిజిటల్ హెల్త్ సిస్టమ్‌పై ఫోకస్
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఇప్పటికే ప్రత్యేకమైన దృష్టి సారించిన సంగతి తెలిసిందే. దీంతో లైఫ్సైన్సెస్లోనూ ఏఐపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే లైఫ్సైన్సెస్లో టెక్నాలజీకితోడు ఏఐ, ఆటోమేషన్ తీసుకురావాలని భావిస్తున్నది. ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో నెక్ట్స్‌జెన్ లైఫ్‌సైన్సెస్ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. ఆ పాలసీని ప్రపంచదేశాలకు మరింత లోతుగా పరిచయం చేసి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నది.
బయో ఏషియా 2026 సదస్సులో భాగంగా అంతర్జాతీయ నిపుణులతో ప్లీనరీలు, ప్యానల్ చర్చలు, పెట్టుబడుల ఒప్పందాలను చేసుకోనుంది. లైఫ్‌సైన్సెస్ వాల్యూ చెయిన్‌లో అత్యంత సమర్థంగా ఆవిష్కరణలు చేసేందుకు ఏఐని ఎలా వినియోగించుకోవచ్చన్న దానిపై చర్చలు జరగనున్నాయి. ఏఐ సాయంతో కొత్త మందుల ఆవిష్కరణ, ఆటోమేషన్ ద్వారా బయో మాన్యుఫ్యాక్చరింగ్, డిజిటల్ హెల్త్ సిస్టమ్‌ను బలోపేతం చేయడం వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు.
