లోన్లలో సగం ఇండ్లకే! ..దేశంలో జనం తీసుకునే అప్పుల్లో 52 శాతం హౌసింగ్ లోన్లే

లోన్లలో సగం ఇండ్లకే! ..దేశంలో జనం తీసుకునే అప్పుల్లో 52 శాతం హౌసింగ్ లోన్లే
  •     ఐదేండ్లలో డబులైన ఇండ్ల లోన్లు.. 30 లక్షల కోట్లకు జంప్
  •     చదువుల కన్నా క్రెడిట్ కార్డులకే ఎక్కువ బాకీలు
  •     రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ

హైదరాబాద్, వెలుగు: సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కల నెరవేర్చుకునేందుకు జనం ఎంత అప్పయినా చేసేస్తున్నారు. వడ్డీల గురించి కూడా ఆలోచించకుండా సొతింటికోసం బ్యాంకుల నుంచి ఇబ్బడిముబ్బడిగా లోన్లు తెస్తున్నారు. దేశంలో జనం తీసుకుంటున్న లోన్లలో సగానికి పైగా ఇండ్ల కోసమేనని తాజాగా కేంద్రం స్పష్టంచేసింది. ప్రస్తుతం బ్యాంకులు ఇస్తున్న పర్సనల్ లోన్లలో ఏకంగా 52 శాతం వాటా హౌసింగ్ లోన్లదేనని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. 2020 నుంచి 2025 వరకు ఇండ్ల కోసం తీసుకున్న లోన్ల అమౌంట్ డబుల్ అయ్యిందని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం రాజ్యసభలో ఎంపీ సాగరిక ఘోష్ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 

30 లక్షల కోట్లు ఇండ్లకే... 

కేంద్రం ప్రకారం.. దేశవ్యాప్తంగా జనం వివిధ బ్యాంకుల్లో ఈ ఏడాది మార్చి 31 వరకు  58. 22 లక్షల కోట్ల పర్సనల్ లోన్లు తీసుకున్నారు. ఇందులో రూ. 30.41 లక్షల కోట్లు (సుమారు 52%) కేవలం ఇండ్ల కోసం తీసుకున్నవే కావడం గమనార్హం.  ఐదేండ్ల కిందట హౌసింగ్ లోన్లకు సంబంధించి 13.36 లక్షల కోట్ల లోన్లు ఉంటే.. అది 2024–25 నాటికి 30.41 లక్షల కోట్లకు చేరింది. అంటే బ్యాంకులు.. కస్టమర్లకు ఇచ్చే ప్రతి రెండో రూపాయి ఇంటి కోసమే ఇస్తున్నాయి. మిగతా 48 శాతంలో వెహికల్స్, క్రెడిట్ కార్డులు,  కన్జూమర్ డ్యూరబుల్స్ వంటి ఇతర అవసరాలు ఉన్నాయి. కరోనా తర్వాత సొంతింటి ఆలోచనలు పెరగడం, రియల్ ఎస్టేట్ రేట్లు మండిపోవడంతో లోన్ల సైజ్ కూడా భారీగా పెరిగిందని కేంద్ర ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 

క్రెడిట్ కార్డులకే ఎక్కువ... 

ఇంటి లోన్ల తర్వాత జనం ఎక్కువగా వెహికల్స్, లైఫ్ స్టైల్ మీదనే ఫోకస్ పెట్టినట్లు లెక్కలు చూస్తే అర్థం అవుతోంది. మొత్తం లోన్లలో వెహికల్స్ కు 10 శాతం వాటా అంటే  సుమారు రూ. 5.84 లక్షల కోట్లు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే... జనం తమ పిల్లల చదువుల కోసం చేసే అప్పుల కన్నా.. క్రెడిట్ కార్డులు కోసం ఎక్కువ అప్పులు చేస్తున్నారు. క్రెడిట్ కార్డుల వాటా 4.5 శాతంగా (రూ. 2.69 లక్షల కోట్లు) ఉండగా, చదువుల కోసం తీసుకునే ఎడ్యుకేషన్ లోన్లు కేవలం 2.5 శాతం(రూ. 1.39 లక్షల కోట్లు) మాత్రమే ఉండటం గమనార్హం. ఇక ఫ్రిజ్, టీవీల కోసం తీసుకునే లోన్లు 1 శాతం (రూ. 42 వేల కోట్లు) మాత్రమే ఉన్నాయి.

తగ్గుతున్న సేవింగ్స్..

ఇండ్లు, కార్లు కొంటున్నరు సరే.. మరి జనం దగ్గర పైసలు మిగులుతున్నయా? అంటే లేదనే చెప్తున్నాయి సర్కార్ లెక్కలు. దేశ జీడీపీలో హౌస్ హోల్డ్ సేవింగ్స్ వాటా దారుణంగా పడిపోతున్నది. 2019~20 లో 19% ఉన్న సేవింగ్స్ రేటు...  2020–21 కరోనా సమయానికి జనం ఖర్చులు తగ్గించుకోవడంతో సేవింగ్స్ రేటు 22.7 శాతానికి పేరిగింది. 2023–24 నాటికి అది కాస్తా 18.1 శాతానికి పడిపోయింది. అంటే జనం సంపాదనలో ఎక్కువ భాగం ఈఎంఐలకే పోతున్నదని లెక్కలు చెబుతున్నాయి. ఇక... బ్యాంకులు కూడా అప్పులు ఎవరికి పడితే వాళ్లకు ఇస్తలేవు. ఎవరైతే టైంకి ఈఎంఐ కడతారో... ఎవరికైతే సిబిల్ స్కోర్ బాగుంటుందో వాళ్లకే రెడ్ కార్పెట్ వేసి లోన్లు ఇస్తున్నాయి. 2019–20లో ప్రైమ్ కస్టమర్లకు ఇచ్చిన లోన్లు 60.6% ఉంటే.. 2025 నాటికి అది 69.4 శాతానికి పెరిగింది. మధ్యస్థంగా ఉంటే నియర్ ప్రైమ్ లోన్లు 23.3 % నుంచి 19.8 శాతానికి పడిపోయింది. చిన్నా చితక ఉద్యోగులు, వ్యాపారులకు ఇచ్చే లోన్లు 16.1% నుంచి 10.8 శాతానికి కంపెనీలు తగ్గించేశాయి.


లోన్ల ప్యాట్రన్ ఇలా...  (శాతాల్లో)

ఇండ్ల కోసం:     52%
వాహనాలు:     10%
క్రెడిట్ కార్డులు:     4.5%
చదువుల కోసం:     2.5%
ఇతర వస్తువులు:     1%