కేయూ భూముల్లో 53 ఎకరాలు గల్లంతు!..ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలతో భూములు కబ్జా?

కేయూ భూముల్లో 53 ఎకరాలు గల్లంతు!..ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలతో భూములు కబ్జా?
  •  673.12 ఎకరాలకు మిగిలింది 619.2 ఎకరాలే..
  • విజిలెన్స్, రెవెన్యూ, కేయూ ఆఫీసర్ల జాయింట్ సర్వేలో బయటపడ్డ విషయం
  • ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలతో భూములు కబ్జా?
  • హద్దులు తేలక ముందుకు సాగని కాంపౌండ్ వాల్ పనులు

హనుమకొండలోని కేయూ భూముల్లో భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. వర్సిటీ ఏర్పాటు సమయంలో 673.12 ఎకరాలుగా గుర్తించిన భూమిలో ప్రస్తుతం 619.2 ఎకరాలు మాత్రమే మిగిలినట్లు జాయింట్ సర్వేలో తేలింది. వివిధ అవసరాలకు కేటాయించిన భూమి పోనూ కూడా ఇంకా 53 ఎకరాలు లెక్కలో లేకపోవడం గమనార్హం. రికార్డుల్లో కనిపించని ఈ భూమి విలువ సుమారు రూ.800 కోట్లు వరకు ఉండొచ్చని అంచనా. ఆక్రమణలు, రికార్డు లోపాలు, అధికారుల నిర్లక్ష్యం కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే సర్వే రిపోర్ట్ ఇప్పటికీ బయటపెట్టకపోవడం మరింత అనుమానాలకు దారితీస్తోంది.

హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ భూముల్లో దాదాపు 53 ఎకరాలు గల్లంతైన ఘటన కలకలం రేపుతోంది. వర్సిటీ ఏర్పాటు సమయంలో 673.12 ఎకరాలకు డ్రాఫ్ట్ డిక్లరేషన్ చేయగా.. చుట్టూ ఆక్రమణలు, అధికారుల నిర్లక్ష్యంతో ప్రస్తుతం 619.2 ఎకరాలు మాత్రమే మిగిలినట్లు తాజా ఫిజికల్ సర్వేలో వెల్లడైంది. దాదాపు ఏడాదిన్నర క్రితం విజిలెన్స్, రెవెన్యూ, కేయూ, మున్సిపల్ అధికారులు జాయింట్‌‌‌‌‌‌‌‌గా నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడింది.

 1976లో కేయూ ఏర్పాటు కోసం హనుమకొండ మండలంలోని కుమార్‌‌‌‌‌‌‌‌పల్లి, లష్కర్ సింగారం, పలివేల్పుల గ్రామాల పరిధిలో 673.12 ఎకరాల భూసేకరణకు డ్రాఫ్ట్ డిక్లరేషన్ జారీ చేశారు. ఇందులో కుమార్‌‌‌‌‌‌‌‌పల్లి శివారులో 188.28 ఎకరాలు, లష్కర్ సింగారంలో 309.20 ఎకరాలు, పలివేల్పుల శివారులో 175.14 ఎకరాలు ఉన్నాయి. అనంతరం ఫైనల్ డిక్లరేషన్ ద్వారా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. అయితే అప్పట్లో హద్దులు నిర్ణయించి కాంపౌండ్ నిర్మించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో సమస్యలు మొదలయ్యాయి.

 తరువాత కాలంలో యూనివర్సిటీ భూముల్లో ఎస్సార్ఎస్పీ కెనాల్ కోసం 45.1 ఎకరాలు, రుద్రమాదేవి ఫిల్టర్ బెడ్ కోసం 13.14 ఎకరాలు, సీఆర్పీఎఫ్ బెటాలియన్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌కు 10 ఎకరాలు, కేయూ బాలమిత్ర పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు 2 ఎకరాలు, ఆల్ ఇండియా రేడియో స్టేషన్‌‌‌‌‌‌‌‌కు 2 ఎకరాలు, ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు 1.01 ఎకరాలు, మున్సిపల్ పైపులైన్ కోసం 2.10 ఎకరాలు ఇలా మొత్తం 72.05 ఎకరాలు ఇతర అవసరాలకు కేటాయించారు. ఇవి పోనూ యూనివర్సిటీకి 601 ఎకరాల భూమి మిగలాల్సి ఉండగా, కొంత ఆక్రమణకు గురైంది.

అక్రమ నిర్మాణాలు..

పాత పట్టాదారులు, ప్రైవేట్ వ్యక్తులు భూములను ఆక్రమించి విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది పోలీస్, ఆర్టీఏ అధికారులు, రాజకీయ నాయకులు ఇండ్లు నిర్మించుకున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్సిటీ భూముల అన్యాక్రాంతంపై అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్(అకుట్), విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టడంతో ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. 2024 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో విజిలెన్స్ అండ్ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్​మెంట్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు జాయింట్ ఫిజికల్ సర్వే నిర్వహించారు. 

యూనివర్సిటీకి ఉండాల్సిన 673.12 ఎకరాల్లో 619.20 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు, అందులో 72.05 ఎకరాలు ఇతర అవసరాలకు కేటాయించగా యూనివర్సిటీ వద్ద 547 ఎకరాలే ఉన్నట్లు తేలింది. దీంతో సుమారు 53 ఎకరాలు మిస్సింగ్‌‌‌‌‌‌‌‌గా నమోదైంది. ఈ 53 ఎకరాల విలువ దాదాపు రూ.800 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సర్వే పూర్తై నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ను బయటపెట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆక్రమణలు జరిగిన ప్రాంతాల్లో 76 ఇండ్లకు ల్యాండ్ డాక్యుమెంట్లు సమర్పించాల్సిందిగా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ చర్యలు చేపట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది.

కాంపౌండ్​ వాల్​ నిర్మాణానికి అడ్డంకులు..

ఇక రాష్ట్ర ప్రభుత్వం క్యాంపస్ చుట్టూ దాదాపు 7 కిలోమీటర్ల మేర కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేసి, 2024 మార్చి 10న శంకుస్థాపన కూడా చేసింది. అయినప్పటికీ భూహద్దుల స్పష్టత లేకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. యూనివర్సిటీ భూముల పర్యవేక్షణ కోసం ప్రత్యేక వ్యవస్థ లేకపోవడం, ప్రస్తుతం బిల్డింగ్ డివిజన్ అధికారులు మాత్రమే వ్యవహారాలు చూడటం కూడా సమస్యగా మారింది. ఇకనైనా భూసర్వే రిపోర్ట్ విడుదల చేసి, ఆక్రమణలపై చర్యలు తీసుకుని, వర్సిటీ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం స్పీడప్​ చేయాలని ఉద్యోగ, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.