గని ప్రమాదాల్లో ఆరేళ్లలో 53 మంది మృతి

గని ప్రమాదాల్లో ఆరేళ్లలో 53 మంది మృతి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగుసిరుల గని సింగరేణిలో కార్మికుల ప్రాణాలకు భరోసా లేకుండా పోయింది. ప్రతి ఏటా రక్షణ వారోత్సవాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నా ఫలితం మాత్రం అంతంతే. రూ. లక్షలు వెచ్చించి రక్షణ వారోత్సవాలను యాజమాన్యం నిర్వహిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో కార్మికులకు అవసరమైన నాణ్యమైన రక్షణ పరికరాలు అందని ద్రాక్షగానే మారాయనే విమర్శలున్నాయి. మరోవైపు గాయాలపాలైన వారి వివరాలను నమోదు చేయటం లేదనే విమర్శలున్నాయి. సింగరేణిలో ఆరేళ్ల కాలంలో 53 మంది కార్మికులు గని ప్రమాదాల్లో అసువులు బాశారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్​ 2వ తేదీ వరకు ఏడుగురు మృతి చెందారు. దాదాపు1,047 తీవ్ర గాయాలపాలయ్యారు. 1,898 స్వల్ప గాయాల బారిన పడ్డారు. ఇదిలా ఉండగా ఓపెన్​కాస్ట్​ గనుల్లో ఎక్కువగా ప్రయివేట్​ కాంట్రాక్టర్లదే దందా కొనసాగుతోంది. అక్కడ వారు చెప్పిందే వేదం. ఆరేళ్లలో దాదాపు 19 మంది కాంట్రాక్ట్​ కార్మికులు గని ప్రమాదాల్లో మృతి చెందారు. 25 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇక స్వల్ప గాయాలకు కొదవలేదు. ఇవన్నీ రికార్డులకెక్కినవే. గాయాలపాలైన వారి వివరాలను చాలావరకు కాంట్రాక్టర్లు రికార్డుల్లో నమోదు చేయటం లేదనే ఆరోపణలున్నాయి.

ఆరేళ్లలో సింగరేణిలో జరిగిన ప్రమాదాలు

గతేడాది గని ప్రమాదాల్లో  కాంట్రాక్ట్​ కార్మికులు ఎవరూ చనిపోలేదు. ఈ ఏడాది మాత్రం ఇప్పటికే నాలుగు  ప్రమాదాల్లో ఏడుగురు చనిపోయారు. 2018లో నలుగురు, 2017లో జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు, 2015లో ముగ్గురు కాంట్రాక్ట్​కార్మికులు మృతిచెందారు. రామగుండం రీజియన్​లోని  ఓపెన్​కాస్ట్​లో మంగళవారం జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఓపెన్​కాస్ట్​ల్లో ఓవర్​బర్డెన్​ తీయటంతో పాటు బ్లాస్టింగ్​ ఇతరత్రా పనులు దాదాపు కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలోనే సాగుతున్నాయి. అధికారులు కేవలం  పర్యవేక్షణ మాత్రమే. ఇల్లెందులోని జేకే ఓపెన్​కాస్ట్​లో గతంలో ఇద్దరు కార్మికులు చనిపోతే గుట్టుచప్పుడు కాకుండా ప్రమాదం పేర ఖమ్మానికి తరలించి చేతులు దులుపుకొన్న దాఖలాలున్నాయి. ఇటువంటి ఘటనలు ఇల్లెందు ఏరియాలో చాలా జరిగాయి. రక్షణ సూత్రాలను కాంట్రాక్టర్లు పట్టించుకోకపోవడం, అధికారులు కూడా చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తుండటం వల్లే ఓసీల్లో కాంట్రాక్ట్​ కార్మికులు బలవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కరెంటు షాక్ తో 28 పశువులు మృతి