న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ వేళ టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా సౌతాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధృవీకరించింది. ‘‘భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా దక్షిణాఫ్రికాతో జరగనున్న మిగిలిన రెండు టీ20లకు దూరమయ్యాడు. బీసీసీఐ వైద్య బృందం అతడి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది’’ అని బీసీసీఐ సోమవారం (డిసెంబర్ 15) ఒక ప్రకటనలో తెలిపింది. సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు అక్షర్ పటేల్ స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఆదివారం (డిసెంబర్ 14) ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మూడవ టీ20లో అక్షర్ బరిలోకి దిగని విషయం తెలిసిందే.
ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మూడు మ్యాచులు ముగియగా.. ఇందులో ఇండియా రెండు, సౌతాఫ్రికా ఒకటి గెలిచాయి. ఇంకా రెండు మ్యాచులు జరగాల్సి ఉంది. లక్నో, అహ్మదాబాద్‌లలో ఈ రెండు మ్యాచులు జరగనున్నాయి. లక్నో వేదికగా జరగనున్న నాలుగో టీ20లో విజయం సాధించి మరో మ్యాచు మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా ప్రయత్నిస్తోంది. మరోవైపు నాలుగో టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని సౌతాఫ్రికా భావిస్తోంది.
చివరి రెండు టీ20ల కోసం భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా , శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా , వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్
