రెండెకరాలు నష్టపోయిన రైతుకు.. పరిహారం 54 రూపాయలు

రెండెకరాలు నష్టపోయిన  రైతుకు..  పరిహారం 54 రూపాయలు
  • వానలతో పంట నష్టపోయిన రైతులు
  • కొందరికి రూ.375 మాత్రమే..మరికొందరికి రూ.2వేల లోపే.. 
  • ఉద్యోగులు, లీడర్ల కుటుంబసభ్యులకు రూ.వేలల్లో..  
  • పంట నష్ట పరిహారం పంపిణీలో  అధికారుల మాయ 
  • జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో  చిత్ర విచిత్రాలు  

భూపాలపల్లి అర్బన్, వెలుగు : భూపాలపల్లి మున్సిపల్​ పరిధిలోని 13, 14, 15, 16 వార్డుల్లో పంట నష్టపరిహార చెక్కుల పంపిణీ గందరగోళంగా మారింది. అధికారులు సర్వే సరిగ్గా చేయకపోవడంతో ఎకరాల చొప్పున నష్టపోయిన రైతులకు వందల్లోపు పరిహారం వచ్చింది. దీంతో ఆందోళనకు దిగారు. 2021-– 22లో వర్షాలతో జంగేడు గ్రామంలో పలువురు రైతులు పంట నష్టపోయారు. అధికారులు నాలుగు వార్డుల్లో 274 మంది నష్టపోయినట్లుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. దీంతో మంగళవారం గ్రామంలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. అయితే, కార్యక్రమానికి వచ్చిన రైతులు ముందుగా తమకు ఎంత పరిహారం వచ్చిందో తెలుసుకుందామని లిస్టులు చూశారు. కానీ, అందులో  ఉన్న ఎమౌంట్​ను చూసి నివ్వెరపోయారు.  

రెండెకరాలు నష్టపోయిన ఓ రైతుకు అతి తక్కువగా రూ. 54 మాత్రమే వచ్చింది. పది మంది రైతులకు రూ.100 నుంచి 375లోపు, 26 మందికి రూ.375 నుంచి రెండువేలలోపు వచ్చింది. ఐదెకరాలు నష్టపోయిన ఓ రైతుకు మాత్రం రూ.20 వేలు ఇచ్చారు. దీంతో రైతులు గొడవకు దిగడంతో గమనించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వెళ్లిపోయారు.  సింగరేణి ఉద్యోగి, బీఆర్​ఎస్​ నేత కుటుంబసభ్యులకు.. 274 మందిలో వ్యవసాయంతో సంబంధం లేని కుటుంబాలకు పరిహారం ఇచ్చారని రైతులు ఆరోపించారు. సింగరేణిలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి కుటుంబంలో నలుగురికి రూ.18 వేలు ఇచ్చారు. ఇందులో ఉద్యోగికి రూ. 5వేలు, ఇతడి తమ్ముడికి రూ.6 వేలు, తండ్రికి రూ.7వేలు ఇచ్చారు. అలాగే ఓ బీఆర్ఎస్​ లీడర్ ​అత్తకు రూ.8 వేలు, బాబాయ్​కి రూ.4వేలు, లీడర్​కు రూ.6వేలు, చెల్లెలికి రూ.3 వేలు ఇచ్చారు. 

రైతుల ఆగ్రహం

కొందరు రైతులకు అతి తక్కువ పరిహారం రావడం, మరికొంతమందికి రాకపోవడంతో ఆఫీసర్లు అవకతవకలకు పాల్పడ్డారని, అధికార పార్టీకి సంబంధించిన లీడర్ల అనుచరులకు, వ్యవసాయం చేయనివాళ్లకు పరిహారం ఇచ్చారని రైతులు గొడవ చేశారు. చెక్కుల పంపిణీకి వచ్చిన అగ్రికల్చర్​ఆఫీసర్లను నిలదీశారు. నష్టపోయిన తమను వదిలేసి వ్యవసాయం చేయని వాళ్లకు  ఇవ్వడం ఏమిటని ఫైర్​అయ్యారు. అసలు తమకు సర్వే చేసిన విషయం కూడా తెలియదన్నారు. ఆఫీసులోనే కూర్చొని నచ్చినవాళ్లకు నచ్చినట్టు పరిహారం రాశారని ఆరోపించారు. దీంతో రైతులకు స్థానిక లీడర్లు నచ్చజెప్పారు.  తర్వాత ఇప్పిస్తామని చెప్పడంతో శాంతించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మళ్లీ వచ్చి చెక్కులు పంపిణీ చేసి వెళ్లిపోయారు. 

 మూడెకరాలకు రూ.378 ఇచ్చిన్రు

ఐదెకరాల మిర్చి తోట పెడితే వర్షాలు పడి మూడెకరాల పంట పోయింది. కానీ, నాకు రూ.378 ఇచ్చిన్రు. మా ఊళ్లె గుంట భూమి సాగు చేయనోనికి ఒక్కో ఇంట్లో ముగ్గురు, నలుగురికి రూ.6 వేల నుంచి 10 వేలు ఇచ్చిన్రు.   :  ఎర్రబెడ్డల మల్లయ్య(రైతు)

ఏం జేస్కోవాలె..

నాకున్న పదెకరాల్లో పత్తి, మిర్చి సాగు చేసిన. భారీ వానల వల్ల రెండెకరాల మిర్చి పంట పూర్తిగా దెబ్బతిన్నది. దీనికి ఆఫీసర్లు ఇచ్చిన పరిహారం 54 రూపాయలు. ఈ పైసలు ఏం చేస్కోవాల్నో అర్థమైతలేదు. నేను చెక్కు మార్చుకోవడానికి పోయిరావడానికే వందలు ఖర్చయితయి.  ఇంత అన్యాయం ఎక్కడన్నా ఉంటదా? :  - చిత్తారి వెంకటస్వామి(రైతు)

నాకైతే పైసా ఇయ్యలే

నేను రెండెకరాలు నష్టపోయిన. కానీ, నాకు పైసా రాలే. పంట వేయనోళ్లకు వేలకు వేలు ఇచ్చి అసలు రైతులకు అన్యాయం చేసిన్రు..రైతు ప్రభుత్వమంటే గిట్లనే ఉంటదా?  సర్కారు పట్టించుకోవాలె  :  -మేకల ఎర్రయ్య(రైతు)