వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు రెండు,మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలి

వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు రెండు,మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలి

కరోనా వ్యాక్సిన్ వేయడంలో విజయం సాధించామని.. దాదాపు 2 నెలల నుంచి వ్యాక్సిన్ వేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా. డీహెచ్‌ శ్రీనివాస్ అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో.. సీఎస్, హెల్త్ సెక్రటరీ సూచనలు మేర‌కు.. కరోనా పారద్రోలేందుకు అధికారులంతా క‌ష్ట‌ప‌డ్డారని ఆయ‌న అన్నారు. శనివారం నుండి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాగా.. రాష్ట్రంలోని 140 కేంద్రాల్లో సుమారు 4వేల మందికి వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు అధికారులు.

140 కేంద్రాల‌లో వ్యాక్సిన్ తీసుకున్న వారింద‌రికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు డీహెచ్ శ్రీనివాస్. డీఎంఈ రమేష్ రెడ్డి, ఐపీఎమ్ డైరెక్టర్ శంకర్, టిమ్స్ డైరెక్టర్ … ఇలా hod లు వ్యాక్సిన్ తీసుకున్నారన్నారు. గాంధీ ఆసుపత్రిలో టీకా వేయించుకున్న క్రిష్ణమ్మ, నార్సింగ్ లో జయమ్మ కు ప్ర‌త్యేక కృతజ్ఞతలు తెలిపారు. 4,200 మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంటే… మధ్యాహ్నం 3.30వరకూ 3530 మందికి ఇచ్చామని, 84 శాతం మందికి వ్యాక్సిన్ అందజేశామ‌ని.. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన అన్నారు. కేవ‌లం 20 మందిలో మాత్ర‌మే మైనర్ రియాక్షన్స్ వచ్చాయని, సోమవారం నుంచి మళ్ళీ వ్యాక్సినేష‌న్ పక్రియ మొద‌ల‌వుతుందని చెప్పారు. రోజు రోజుకు సెంటర్స్ ను, బెనిఫెసర్స్ ను పెంచుకుంటూ… మరొక వారం పది రోజుల్లో 1213 సెంటర్స్ ను ప్రారంభిస్తామ‌ని శ్రీనివాస్ తెలిపారు. ఫస్ట్ డోస్ లో ఎఫెక్ట్ రాదని.. రెండో డోస్ వేసుకోవాలని… మొత్తం మీద 42 రోజుల తరువాత వ్యాక్సిన్ పని చేస్తుందని ఆయ‌న అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు రెండు మూడు రోజులు జాగ్రత్తగా ఉండాల‌ని సూచించారు.

డిఎంఈ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీలో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎవరికి ఎలాంటి రియాక్షన్స్ రాలేదని, త‌మ‌ సిబ్బందికి భరోసా ఇచ్చేందుకే తాము వ్యాక్సిన్ తీసుకున్నామని అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో డయాబెటిస్, బిపి ఉన్నాయని.. అయినా వారికి ఎలాంటి సమస్య రాలేదని అన్నారు. 3530 మందిలో ఎవరికి సీరియస్ రియాక్షన్స్ రాలేదని అన్నారు. భయం లేకుండా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని…. వ్యాక్సిన్ తోనే కోవిడ్ వైరస్ చైన్ ని బ్రేక్ చేయవచ్చని ర‌మేష్ రెడ్డి తెలిపారు