
- బడ్జెట్లో రూ.30,233.83 కోట్లు కేటాయించిన కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జలవనరుల శాఖకు బడ్జెట్ లో కేటాయింపులను పెంచింది. జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖకు రూ.30,233.83 కోట్లు కేటాయించింది. గత ఏడాది (రూ.19,516.92 కోట్లు) కేటాయింపులతో పోలిస్తే 55 శాతం ఫండ్స్‌ను పెంచింది. ఇందులో ప్రధాన నీటిపారుదల, వరద నియంత్రణ ప్రాజెక్టులకు అధనపు నిధులు కేటాయించింది. అలాగే, నమామి గంగే మిషన్-–2 కోసం కేటాయింపులు గణనీయంగా పెరిగాయి.
అనేక రాష్ట్రాలలో వరద నియంత్రణ చర్యలు, నీటిపారుదల ప్రాజెక్టులను మెరుగుపరచడానికి 11,500 కోట్ల రూపాయలతో సమగ్ర ఆర్థిక సహాయ ప్రణాళికను ప్రకటించారు. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఇతర వనరుల ద్వారా వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తెలిపారు.
నేషనల్ గంగా ప్లాన్ కోసం రూ.3,345.70 కోట్లు
గంగా నది పునరుజ్జీవనానికి ఉద్దేశించిన నమామి గంగే మిషన్--2కు ఈ బడ్జెట్లో అధిక ప్రాధాన్యమిచ్చారు. నదిని శుభ్రపరచడానికి, పరిరక్షించడానికి నేషనల్గంగా ప్లాన్ కోసం గత బడ్జెట్లో రూ.2,400 కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.3,345.70 కోట్లు కేటాయించారు. వీటితో పాటు ఫరక్కా బ్యారేజీ ప్రాజెక్ట్, ఆనకట్ట పునరుద్ధరణ, అభివృద్ధి కార్యక్రమం, అటల్ భుజల్ యోజన కింద భూగర్భజల నిర్వహణ కార్యక్రమాలు వంటి కీలక కార్యక్రమాలకు ఆర్థిక కేటాయింపులు పెరిగాయి. అదనంగా, ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన, జాతీయ నదుల సంరక్షణ ప్రణాళిక కోసం నిధులు కేటాయించారు.