గుర్తింపు లేని 552 ఇంటర్ కాలేజీలు.. గందరగోళంలో లక్షన్నర మంది స్టూడెంట్లు

గుర్తింపు లేని 552 ఇంటర్ కాలేజీలు.. గందరగోళంలో లక్షన్నర మంది స్టూడెంట్లు
  • 552 ఇంటర్ కాలేజీలకు గుర్తింపు లేదు
  • గందరగోళంలో లక్షన్నర మంది స్టూడెంట్ల భవిష్యత్తు​
  • క్లాసులు స్టార్ట్ అయి 3నెలలు అవుతున్నా పట్టించుకోని సర్కార్
  • ఫైర్​ సేఫ్టీ, మిక్స్ డ్ ఆక్యుపెన్సీ బిల్డింగ్ ఇష్యూలతో ఆగిన ప్రాసెస్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్ ఎడ్యుకేషన్​ దశ దిశ లేకుండా నడుస్తోంది. కాలేజీల్లో అడ్మిషన్లు, క్లాసులు ప్రారంభమై మూణ్నాలుగు నెలలు గడుస్తున్నా... 552 ప్రైవేటు జూనియర్ కాలేజీల అఫిలియేషన్​పై సర్కార్ ఎటూ తేల్చడం లేదు. మొత్తం ప్రైవేటు కాలేజీల్లో మూడోవంతు ఇలా అనుబంధ గుర్తింపు లేకుండానే కొనసాగుతున్నాయి. అయితే వీటికి అఫిలియేషన్ ఇవ్వలేదనే విషయాన్ని మాత్రం అధికారులు బయటకు ప్రకటించడం లేదు. ఈ విషయం తెలియక దాదాపు లక్షన్నర మంది స్టూడెంట్లు వాటిలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు గుర్తింపు వస్తుందో.. రాదో అని ఈ స్టూడెంట్లు, వాళ్ల పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు. ఒక వేళ సర్కారు గుర్తింపు ఇవ్వకపోతే, వారి పరిస్థితి ఏంటనే ప్రశ్నకు విద్యాశాఖ అధికారుల వద్ద కూడా సమాధానం లేదు.

ఏటా ఇదే తీరు
2021–2022కు సంబంధించి మే 25 నుంచే అడ్మిషన్లు మొదలు పెడుతున్నట్లు ఇంటర్ బోర్డు షెడ్యూల్ రిలీజ్ చేసింది. జులై ఫస్ట్ నుంచి ఆన్​లైన్, సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఆఫ్​లైన్ క్లాసులు మొదలయ్యాయి. అయితే నాలుగు నెలలవుతున్నా ఇంకా ఆ అడ్మిషన్ల ప్రాసెస్ కొనసాగుతూనే ఉంది. ఇంకా ఈ నెలాఖరు వరకూ కాలేజీల్లో చేరే అవకాశముంది. కానీ ఇప్పటికీ ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల అఫిలియేషన్ల ప్రాసెస్ పూర్తికాలేదు. 2020–21లో 1,486 ప్రైవేటు కాలేజీలకు అనుమతి ఇవ్వగా, ఈ ఏడాది బుధవారం నాటికి 934 కాలేజీలకు గుర్తింపు ఇచ్చినట్టు ఇంటర్ బోర్డు తన వెబ్​సైట్​లో పేర్కొన్నది. దీన్నిబట్టి ఇంకా 552 కాలేజీలకు అఫిలియేషన్ ఇవ్వలేదు. ఆయా కాలేజీలు మిక్స్ డ్ ఆక్యుపెన్సీ బిల్డింగ్​లలో కొనసాగుతుండటం, ఫైర్​సేఫ్టీ అనుమతులు లేకపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెప్తున్నారు. కిందటేడాది కూడా ఇవే కారణాలతో పెండింగ్​లో పెట్టి ఏడాది చివరలో ఇచ్చారు. ఈ సారి కూడా నిరుటి లాగే చివరి నిమిషంలో గుర్తింపు ఇస్తారనే ధీమాతో మేనేజ్‌మెంట్లు ఉన్నాయి. కొన్నేండ్లుగా ఇదేతంతు నడుస్తున్నా, ఇటు ఇంటర్ బోర్డు గానీ, అటు మేనేజ్మెంట్లుగానీ మారడం లేదు. అఫిలియేషన్ పొందని కాలేజీల్లో మిక్స్ డ్ ఆక్యుపెన్సీ బిల్డింగ్ లలో కొనసాగుతున్నవే ఎక్కువగా ఉన్నాయి. వీటి అఫిలియేషన్​పై సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా, కావాలనే నాన్చుతున్నట్టు స్పష్టమవుతోంది.

ఆ వివరాలెందుకు చెప్పట్లే
ప్రైవేటు కాలేజీల్లో మే నెలలోనే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. జూన్ నుంచే క్లాసులు స్టార్ట్ కాగా, సిలబస్ ముగింపు దశలో ఉంది. గుర్తింపు పొందిన కాలేజీలే అడ్మిషన్లు స్టార్ట్ చేయాలని ప్రకటన రిలీజ్ చేసి చేతులు దులుపుకొన్నారు. అయితే గుర్తింపు లేని కాలేజీల్లో అడ్మిషన్లు, క్లాసులు జరుగుతున్నా ఇంటర్ బోర్డు అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ ఆ కాలేజీలకు గుర్తింపు లేదనే విషయాన్ని ఇంటర్ బోర్డు అధికారులు బహిర్గతం చేయడం లేదు. అయితే నాలుగు రోజుల కింద హైదరాబాద్​నగరంలోని న్యూ మదీనా జూనియర్ కాలేజీకి గుర్తింపు ఇవ్వలేదనీ, దాంట్లో స్టూడెంట్లు ఎవరూ చేరొద్దని ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. మరి ఇప్పటికీ గుర్తింపు రాని 552 కాలేజీల విషయాన్ని ఇంటర్ బోర్డు ఎందుకు దాస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సర్కారు పర్మిషన్ ఇవ్వకపోతే, ఆ కాలేజీల్లో చదివే దాదాపు లక్షన్నర మంది స్టూడెంట్ల పరిస్థితి ఏంటని స్టూడెంట్స్ యూనియన్లు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికైనా గుర్తింపు ఇస్తారో ఇవ్వరో అనే విషయాన్ని సర్కారు స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

త్వరలోనే నిర్ణయం
కొన్ని ప్రైవేటు కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియ పెండింగ్​లో ఉంది. మిక్స్​డ్ ఆక్యుపెన్సీ, ఫైర్​సెఫ్టీ అంశాల కారణంగా ఆయా కాలేజీలకు గుర్తింపు ఇవ్వలేదు. దీనికి సంబంధించిన ఫైల్ సర్కారు పరిశీలనలో ఉంది. త్వరలోనే ఆయా కాలేజీల గుర్తింపుపై నిర్ణయం తీసుకుంటం.
- ఉమర్ జలీల్, ఇంటర్ బోర్డు సెక్రటరీ

వెంటనే అఫిలియేషన్లు ఇవ్వాలె
వివిధ కారణాలతో అఫిలియేషన్ ఇవ్వకుండా ఆపిన ప్రైవేటు జూనియర్ కాలేజీలకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలి. ఇప్పటికే స్టూడెంట్లు అయోమయానికి గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నం. స్కూళ్లు, డిగ్రీ కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చినట్టే , జూనియర్​ కాలేజీలకు కూడా శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం చూపించాలని కోరుతున్నం.
- గౌరీ సతీశ్‌, ప్రైవేటు జూనియర్ కాలేజీల మేనేజ్‌మెంట్ల సంఘం స్టేట్ ప్రెసిడెంట్