
దీపావళి భారతీయులకు.. ఆనందం, సంపద, సంతోషాన్ని అందించే పండుగ. ఈ సీజన్‌లో బహుమతులు ఇచ్చుకోవడం అనాదిగా వస్తున్న ఒక ఆచారం. వాటిలో బంగారాన్ని ప్రియమైనవారికి బహుమతిగా అందించటం అత్యంత ప్రాధాన్యమైంది. దీనిని చాలా సమాజాల్లో ప్రజలు ఐశ్వర్యం, ఆశీర్వాదం, శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తుంటారు. గోల్డ్ కాయిన్స్, ఆభరణాలు, లేదా చిన్న బార్లు రూపంలో బంగారం గిఫ్ట్ చేసుకుంటుంటారు ఇండియన్స్.
కానీ ఈ ఏడాది బంగారం ధరలు కొత్త గరిష్ట స్థాయికి చేరడంతో.. చాలా మంది ఒక ప్రశ్న వెంటాడుతోంది. దీపావళిలో ఎంత విలువైన బంగారం బహుమతిగా అందుకుంటే ఆదాయపు పన్ను చెల్లించాలి అన్నదే. అసలు ఈ బహుమతులపై ఎలాంటి పరిమితులు ఉన్నాయి అనే విషయాలపై సీఏ సురేష్ సురానా ఏమని చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. గోల్డ్ ఎంత బహుమతిగా పొందాలనే అంశంపై లిమిట్స్ లేవని అయితే దానిని ఎవరి నుంచి పొందారు, దాని విలువ ఎంత అనే విషయాల ఆధారంగా పన్ను ప్రభావం ఉంటుందని సీఏ పేర్కొన్నారు.
ఆదాయపు పన్ను చట్టంలోని Section 56(2)(x) బహుమతులకు సంబంధించి టాక్సేషన్ విషయాలను చూసుకుంటుంది. ఇందులో డబ్బు, బంగారం, ఆభరణాలు, షేర్లు, లేదా స్థిరాస్తి వంటి వాటిని“Income from Other Sources” కింద పన్నుకి గురవుతాయి. అయితే కొంతమంది బంధువుల నుండి వచ్చిన బహుమతులు మినహాయింపుకి అర్హతను చట్టం అందిస్తోంది. తల్లిదండ్రులు, సోదరులు, జీవిత భాగస్వామి, అమ్మమ్మ తాతయ్యలు, అల్లుడు కోడలు వంటి పొందే బంగారం పూర్తిగా పన్ను రహితమైనది.
ఇక బంధువులు కాని వ్యక్తులు లేదా స్నేహితుల నుంచి వచ్చిన బహుమతుల మొత్తం విలువ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50వేలు దాటితే మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది అందుకున్న బహుమతిపై. గిఫ్ట్ విలువ రూ.50వేల లోపే ఉంటే ఎలాంటి పన్ను బాధ్యత ఉండదని సీఏ చెప్పారు. ఇది మొత్తం సంవత్సరానికి వర్తిస్తుంది.
పెళ్లి సమయంలో పొందే గిఫ్ట్స్ స్పెషల్..
ఎవరైనా వ్యక్తి తన పెళ్లి సమయంలో అందుకునే ప్రతి బహుమతి అది ఎవరి నుంచి వచ్చినా సరే పూర్తిగా పన్ను మినహాయింపులను అందిస్తోంది చట్టం. వివాహ సమయంలో గిఫ్ట్ విలువకు కూడా ఎలాంటి పరిమితులు లేవు. బంగారం, వెండి, వజ్రాలు, కార్లు, ఇల్లు గిఫ్ట్ ఏదైనా సరే ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. కానీ దీపావళి, పుట్టినరోజు వంటి ఇతర సమయాల్లో మాత్రం పరిమితులు, సోర్స్ ఆధారంగా పన్ను లెక్కించబడుతుంది.