న్యూఢిల్లీ: భారత విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) 2024–25లో రూ.2,701 కోట్ల లాభాన్ని నమోదు చేశాయి. గతంలో నిరంతర నష్టాలను ఎదుర్కొన్న ఈ రంగం, మొదటిసారిగా లాభాల్లోకి వచ్చింది. దేశంలోని అన్ని డిస్కమ్‌లకు కలిపి 2023–24లో రూ.25,553 కోట్ల నష్టం రాగా, 2013–14లో రూ.67,962 కోట్ల నష్టం వచ్చింది.
ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతోనే ఈ రంగం లాభాల్లోకి వచ్చిందని పవర్ మినిస్టర్ మనోహర్ లాల్ తెలిపారు. ఎలక్ట్రిసిటీ (లేట్ పేమెంట్ సర్‌ఛార్జీ) నియమాలతో బకాయిలు 96శాతం తగ్గాయని అన్నారు. 2022లో రూ.1,39,947 కోట్లుగా ఉన్న బకాయిలు, 2026 జనవరి నాటికి రూ.4,927 కోట్లకు దిగొచ్చాయని తెలిపారు.
రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్‌డీఎస్‌ఎస్), స్మార్ట్ మీటరింగ్, మౌలిక వసతుల ఆధునీకరణ వంటి చర్యలు రంగాన్ని ఆర్థికంగా బలపరిచాయన్నారు.
