బ్రిటానియాకు రూ.559 కోట్ల లాభం

బ్రిటానియాకు  రూ.559 కోట్ల లాభం

న్యూఢిల్లీ: బిస్కెట్స్ తయారీ కంపెనీ బ్రిటానియాకు ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్ (క్యూ4) లో రూ.559 కోట్ల నికర లాభం (కన్సాలిడేట్‌)  వచ్చింది.  కిందటేడాది  మార్చి క్వార్టర్‌‌లో వచ్చిన ప్రాఫిట్‌తో పోలిస్తే ఇది 47 శాతం ఎక్కువ. కంపెనీ రెవెన్యూ ఏడాది ప్రాతిపదికన 13 శాతం పెరిగి రూ.4,023.18 కోట్లకు ఎగిసింది. 2022–23 ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే బ్రిటానియాకు రూ. 2,322 కోట్ల నికర లాభం, రూ.16,300.55 కోట్ల రెవెన్యూ వచ్చింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే  ప్రాఫిట్  52.3 శాతం పెరగగా, రెవెన్యూ 15.3 శాతం పెరిగింది.

కంపెనీ షేరు శుక్రవారం ఒక శాతం లాభపడి రూ.4,636.95 వద్ద ముగిసింది.  క్వార్టర్ ప్రాతిపదికన 11 శాతం గ్రోత్‌ను నమోదు చేశామని,   డిస్ట్రిబ్యూషన్‌లో  మెరుగైన పనితీరుతో ఇది సాధ్యమయ్యిందని కంపెనీ ఎండీ వరుణ్ బెర్రీ పేర్కొన్నారు. పామ్‌ ఆయిల్‌, ప్యాకేజింగ్ మెటీరియల్స్‌ ధరలు తగ్గడంతో పాటు  ముడి సరుకుల ధరలు దిగొచ్చాయని అన్నారు. మరోవైపు బిస్కెట్ల తయారీలో వాడే పిండి ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయని వివరించారు. ఖర్చులు తగ్గించుకోవడానికి తాము తీసుకున్న చర్యలతో పాటు కమొడిటీల ధరలు తగ్గడంతో  మార్చి క్వార్టర్‌‌లో మెరుగైన  ఆపరేటింగ్ మార్జిన్‌ను నమోదు చేయగలిగామని బెర్రీ అన్నారు.

గోధుమ, చక్కెర వంటి కమొడిటీల ధరలను గమనిస్తున్నామని వివరించారు. మార్కెట్‌లో మరింతగా విస్తరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కంపెనీ ముడి సరుకుల  కోసం మార్చి క్వార్టర్‌‌లో రూ.1,717 కోట్లను ఖర్చు చేసింది. ఇది ఏడాది ప్రాతిపదికన 12 % ఎక్కువ.