అయోధ్య రామ్ లల్లాకు 56 రకాల ప్రసాదాలు

అయోధ్య రామ్ లల్లాకు 56 రకాల ప్రసాదాలు

అయోధ్యలో బాలక్​ రామ్​ విగ్రహాన్ని ప్రతిష్టించి నెల రోజులు దాటింది.  అయోధ్య రాముడిని నిత్యం పూజించి హారతులు ఇస్తున్నారు.  భక్తులు స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.  రాంలల్లాకు  హారతి ఇచ్చి 56 రకాల భోగ్​ప్రసాదాలను  సమర్పిస్తున్నారు.  ఈ ప్రసాదాల్లో  రసగుల్లా, జలేబీ, బర్ఫీ మరియు లడ్డూలు వంటి వివిధ రకాల స్వీట్లు ఉన్నాయి.అయోధ్య రామయ్య  దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. రామ్​లల్లాకు హారతి ఇచ్చే సమయంలో భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు.  దేశ విదేశాల నుంచి స్వామిని దర్శించుకొనేందుకు భక్తులు వస్తున్నారు. 

శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట రోజున రామ్ లల్లాకి 56 రకాల ప్రసాదాలను అందించారు. లక్నోలోని ఫేమస్ దుకాణమైన మధురిమ నుంచి ఈ 56 రకాల ప్రసాదాలను రాముడికి సమర్పించారు.  రసగుల్లా, లడ్డూ, బర్ఫీ తదితర రకాల మిఠాయిలున్నాయి. గుజరాత్‌లోని కళాకారులు రామ భక్తుల కోసం ఈ లడ్డూల ప్రసాదాన్ని తయారు చేశారు.  జనవరి 22న జరిగిన సంప్రోక్షణ మహోత్సవం తర్వాత ఆలయానికి 25 కేజీల బంగారం, వెండి ఆభరణాలు, దాదాపు 25 కోట్ల రూపాయల విరాళాలు అందాయని ట్రస్టు అధికారులు తెలిపారు.

పురాణాల ప్రకారం కృత యుగంలో భగవాన్​ ఇంద్రుని ఆశీర్వాదం కోసం విందులు ఏర్పాటు చేసేవారు.  ఆ సమయంలో దేవుడిని ఆరాధించి.. హారతులు ఇచ్చి  56 రకాల మధురమైన పదార్ధాలను  ప్రసాదాలను నైవేద్యంగా పెట్టేవారని  విష్ణుపురాణంలో ఉందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. కృత యుగంలో మునులు.. రుషులకు ఈ ప్రసాదాలను పంచిపెట్టేవారట. ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణుడు గోవర్దన కొండను పూజించినప్పుడు 56 రకాల ప్రసాదాలను గోవర్దన కొండకు సమర్పించారని పురాణాలు చెబుతున్నాయి.  అందుకే అయోధ్య లో రామ్​లల్లా ప్రతిష్ఠ రోజున 56 రకాల ప్రసాదాలను బాలక్​ రాముడికి నివేదించినట్లు  ట్రస్టు అధికారులు తెలిపారు.