హైదరాబాద్ లో ఆరేండ్ల పాప కిడ్నాప్ .. బిడ్డను తీసుకుని కల్లు తాగడానికి వెళ్లిన తల్లి

హైదరాబాద్ లో ఆరేండ్ల పాప కిడ్నాప్ .. బిడ్డను తీసుకుని కల్లు తాగడానికి వెళ్లిన తల్లి
  • కాంపౌండ్​లో మాట్లాడుతుండగా తీసుకువెళ్లిన మరో మహిళ
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

శంషాబాద్, వెలుగు: తల్లితో కలిసి కల్లు కాంపౌండ్​కు వెళ్లిన ఓ చిన్నారి కిడ్నాప్​కు గురైంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్​పోర్ట్​పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బిడ్డను తీసుకుని కల్లు కంపౌండ్​కు వెళ్లిన తల్లి.. అక్కడ వేరే వారితో ముచ్చటపెడుతుండగా, ఎదురుగా కూర్చున్న మహిళ పాపను తన వెంట తీసుకువెళ్లింది. ఈ ఘటన వారం రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది. సీఐ బాలరాజు కథనం ప్రకారం.. క్యాతమూరి లక్ష్మి, రమేశ్​దంపతులకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. 

వీరిది మహబూబ్​నగర్​జిల్లా మిడ్జిల్​మండలంలోని కంజర్లపల్లి. కూలీలుగా పని చేస్తుంటారు. జులై 1న మధ్యాహ్నం మహబూబ్​నగర్​నుంచి శంషాబాద్ రైల్వే స్టేషన్ కు లక్ష్మి, ఆమె మామ, పెద్ద బిడ్డ కీర్తన(6), మరో కూతురు(3)తో కలిసి వచ్చింది. అక్కడి నుంచి పక్కనే ఉన్న కల్లు కాంపౌండ్​కు వెళ్లారు. లక్ష్మి కల్లు తాగుతూ మామతో మాటల్లో పడిపోగా ఎదురుగా కూర్చున్న ఓ మహిళ గమనించింది. అక్కడే ఉన్న కీర్తనకు ఏదో చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లింది. కాసేపటి తర్వాత కీర్తన కనిపించడం లేదని గ్రహించిన తల్లి చుట్టుపక్కల వెతికింది. రాత్రి వరకూ ఆచూకీ దొరక్కపొవడంతో స్వగ్రామానికి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీస్​స్టేషన్​లో కంప్లయింట్​ఇవ్వాలని చెప్పడంతో సోమవారం శంషాబాద్ ఎయిర్​పోర్ట్​పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఆటోలో పాపను తీసుకువెళ్తున్న దృశ్యాలు..

పోలీసులు కల్లు కాంపౌండ్ లోని సీసీ కెమెరాలు పరిశీలించగా, అందులో ఒక గుర్తు తెలియని మహిళ కీర్తనను తీసుకువెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. అక్కడి నుంచి తిరిగి శంషాబాద్ బస్టాండ్ వద్ద మరికొన్ని సీసీ కెమెరాలు చూడగా.. ఆటోలో పాపను తీసుకెళుతున్నట్టు కనిపించింది. దీంతో కీర్తనను గుర్తించేందుకు ఐదు స్పెషల్​టీమ్స్​ ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.