60 సంవత్సరాల అభివృద్ధిని 6 ఏళ్లలో చేసి చూపించారు : హరీష్ రావు

60 సంవత్సరాల అభివృద్ధిని 6 ఏళ్లలో చేసి చూపించారు : హరీష్ రావు

రాష్టంలో తనకు తెలిసి పార్టీలను రెండు పర్యాయాలు నిలబెట్టిన వాళ్లలో ఒకరు నందమూరి తారకరామారావు, మరొకరు సీఎం కేసీఆర్ అని మంత్రి హరీష్ రావు ప్రశంసల వర్షం గుప్పించారు. గజ్వేల్ టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. 60 సంవత్సరాల అభివృద్ధిని సీఎం 6 సంవత్సరాలలో చేసి చూపించారని కొనియాడారు. గతుకుల గజ్వేల్ ను బతుకుల నిలయంగా మార్చారని,  రింగు రోడ్డు, పార్కులు, రైల్వేస్టేషన్, డ్యాములు తెచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి గజ్వేల్ కు రాకముందు యాసంగిలో 7వేళా ఎకరాల సాగు చేసినవారు ఇప్పుడు 17వేల ఎకరాలను సాగు చేస్తున్నారని మంత్రి గొప్పగా చెప్పారు. 60 ఏళ్ళు వెనకకు ఉన్న గజ్వేల్ ను 60 ఏళ్లు ముందుకు తీసుకుపోయారన్నారు.

మన రాష్ట్ర ప్రభుత్వాల పతకాలను కేంద్ర ప్రభుత్వాలు నకల్ కొడుతున్నాయన్న మంత్రి హరీష్ రావు.. సీఎం కేసీఆర్ దేశంలో మార్పు కోసం తీసుకువచ్చేందుకు బయలు దేరారని చెప్పారు. మన నినాదం ఒక్కటేనని, అదే రైతు నినాదమని తెలిపారు. తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గులాం గిరి చేస్తుందే తప్ప ఢిల్లీ పెద్దలకు కాదని ఆయన స్పష్టం చేశారు. నిజాలను ఎప్పుడూ ప్రజల ముందు పెట్టాలని ఆనాడు బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పారన్న మంత్రి.. తాను తెలంగాణ రాక ముందు  సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నరోజుల్లో రైతులు, చేనేత కార్మికులు చనిపోతే పక్క రాష్ట్రాల నుండి విలేకరులు వచ్చి వార్తలు రాస్తుండేనని గుర్తు చేసుకున్నారు. మునుపు గణేష్ నిమర్జనాలు, బతుకమ్మ పండుగలు వస్తే ఏ చెరువులో వేయాలో తెల్వక పోతుండేనని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. గజ్వేల్ అభివృద్ధి గజమాల లాంటిదన్న మంత్రి హరీష్  స్పష్టం చేశారు.