స్కూటీపై 600 కి.మీ. వెళ్లి గంజాయి సప్లై చేసింది

స్కూటీపై 600 కి.మీ. వెళ్లి గంజాయి సప్లై చేసింది
  •      నిఘా పెట్టి పట్టుకున్న పోలీసులు
  •     28 కిలోల సరుకు స్వాధీనం

గుడిహత్నూర్‌‌, వెలుగు: గంజాయి తీసే కూలీ అయిన ఓ మహిళ అత్యాశకు పోయి స్మగ్లర్ అవతారమెత్తింది. సినిమాల్లో లాగా తన స్కూటీ డిక్కీలోనే గంజాయిని దాచింది. ఒడిశా నుంచి ముంబైకి 600 కిలోమీటర్లకు పైగా  ఒంటరిగా బయలుదేరింది. మన రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వగానే యాంటీ నార్కోటిక్ బ్యూరో చేతికి చిక్కింది. చివరకు జైలుపాలు అయ్యింది. ఆమె వద్ద నుంచి పోలీసులు రూ.8 లక్షల విలువైన 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని వాసిం జిల్లాకు చెందిన మోహిని సంతోష్‌‌ ఠాక్రే(33) గంజాయి తీసే కూలీగా పనిచేస్తూ స్మగ్లర్ గా మారింది. ఒడిశాలోని మల్కన్‌‌గిరికి చెందిన అర్జున్‌‌ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రకు చెందిన నితిన్‌‌ అనే వ్యక్తికి అమ్మేది. 

అందుకు తన స్కూటీలో  గంజాయిని దాచి అడవులగుండా ఒంటరిగా 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించేది. తెలంగాణ మీదుగా ముంబై తదితర ప్రాంతాలకు పెద్ద మొత్తంలో గంజాయి సప్లై అవుతున్నదని గుర్తించిన యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు గత రెండు నెలలుగా నిఘా పెంచారు. గురువారం పోలీసులు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామంలో మోహిని సంతోష్‌‌ ఠాక్రేను పట్టుకున్నారు. ఆమె స్కూటీ డిక్కీలో నుంచి 28 కిలోల ప్యాక్‌‌ చేసిన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.8 లక్షల వరకు ఉంటుందని ఆఫీసర్లు వెల్లడించారు. మోహినిపై కేసు నమోదు చేసి  కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు.