
- రెండో విడతలో లక్షన్నర లోన్లు మాఫీ చేసిన ప్రభుత్వం
- రెండు విడతల్లో కలిపి 17.75 లక్షల రైతులకు రూ.12,224.94 కోట్లు మాఫీ
- పంటరుణాల మాఫీలో నల్గొండ టాప్
- హైదరాబాద్‌లో ఏడుగురు రైతులకు రూ.6 లక్షలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీలో భాగంగా రెండో విడతలో లక్షన్నర రూపాలయ వరకు ఉన్న క్రాప్‌లోన్లను మంగళవారం మాఫీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర రూపాలయ వరకు పంట రుణాలు ఉన్న 6 లక్షల 40 వేల 823 మంది రైతుల బ్యాంకు అకౌంట్లలో రూ.6,190.01కోట్ల నిధులను జమ చేసింది. దీంతో లక్షన్నర వరకు పంట రుణాలున్న కుటుంబాలన్నీ రుణ విముక్తం అయ్యాయి.
మొదటి విడతలో రూ.లక్ష వరకు పంట రుణాలు ఉన్న 11,34,412 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.6,034.96 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసి రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఇప్పటి వరకు రెండు విడుతల్లో కలిపి మొత్తం 17,75,235 రైతుల క్రాప్‌లోన్ అకౌంట్లలో రూ.12,224.98 కోట్లు జమ చేసినట్లు రైతులకు పంట రుణమాఫీ చేసినట్లు వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లే చేయడం పట్ల రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
నల్గొండ జిల్లాలో మొత్తం రూ.984 కోట్లు మాఫీ
రూ.లక్షన్నర రుణమాఫీలో నల్గొండ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. మంగళవారం రుణమాఫీ జరిగిన 33 జిల్లాల్లో అత్యధికంగా నల్గొండలో 51,515 రైతుల అకౌంట్లలో రూ.514.26కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. ఇలా రెండు విడుతల్లో కలిపి నల్గొండ జిల్లాకే చెందిన 1,37,430 రైతులకు సంబంధించిన రూ.984.34కోట్లు మాఫీ చేశారు. రుణమాఫీలో నాగర్ కర్నూల్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది.
నాగర్ కర్నూల్ జిల్లాలో రెండు విడుతల్లో కలిపి 80,395 మంది రైతుల బ్యాంకు రుణ ఖాతాల్లోకి రూ.583.87కోట్లు నిధులు జమ అయ్యాయి. ఆ తరువాత స్థానంలో సంగారెడ్డి జిల్లాలో 77,951మంది రైతుల ఖాతాల్లో రూ.563.99కోట్లు నిధులు జమ చేశారు. ఆ తరువాత సిద్దిపేట జిల్లాలో రూ.558.61కోట్లు, సూర్యపేట జిల్లాలో రూ.532.91కోట్లు, ఖమ్మం జిల్లాలో రూ.519.85 కోట్లు మాఫీ జరిగి మొదటి ఆరుస్థానాల్లో నిలిచాయి.
ఆ తరువాత వరుసగా రంగారెడ్డి జిల్లాలోనూ రెండు విడుతల్లో కలిపి 75,595 మంది రైతుల ఖాతాల్లో రూ.497.44కోట్లు నిధులు జమయ్యాయి. మెదక్ జిల్లాలో 74,342 మంది రైతులకు రూ.473.78 కోట్లు మాఫీ అయ్యాయి. వికారాబాద్ జిల్లాలో 66,637 మంది రైతులకు రూ.472.12 కోట్లు మాఫీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 66,134 మంది రైతుల ఖాతాల్లో రూ.459.49 కోట్లు వేసి రుణమాఫీ చేశారు.
లాస్ట్ పొజిషన్లో..
రుణమాఫీలో చివరి స్థానాల్లో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలు నిలిచాయి. 32వ స్థానంలో ఉన్న మేడ్చల్ మల్కాజిగిరిలో 2,799మంది రైతులకు రెండు విడుతల్లో రూ.15.56కోట్లు రుణమాఫీ జరిగింది. హైదరాబాద్ జిల్లాలో ఏడుగురు రైతులకు చెందిన కేవలం రూ.6లక్షల పంట రుణాలు మాఫీ అయ్యాయి.