- 6.22 కోట్ల చేప పిల్లలు వదిలేందుకు ఏర్పాట్లు
- రెండు, మూడు రోజుల్లో ప్రక్రియ పూర్తి
రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు చెరువుల్లోకి చేపల పిల్లలను వదిలేందుకు సిద్ధమైంది. ఈ వానాకాలం సమృద్ధిగా వర్షాలు పడటంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో సర్కారు ఈ ఏడాది కాస్త లేటైనా చేప పిల్లల సరఫరాకు ఆన్లైన్ టెండర్ల ప్రక్రియను ముగించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఫిష్ సీడ్స్ సరఫరా చేశారు. వాటిని రెండు, మూడు రోజుల్లో అన్ని చెరువుల్లోకి వదిలేందుకు మత్స్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రారంభం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 3,441 చెరువుల్లో 6.22 కోట్ల చేప పిల్లలను వదలనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ కార్యక్రమాన్ని రెండు రోజుల క్రితమే ప్రభుత్వ ఆది శ్రీనివాస్, ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ప్రారంభించారు. వారు మల్కపేట రిజర్వాయర్ లో చేప పిల్లలను వదిలారు. ఈ జిల్లాలో 452 చెరువులు, 4 ప్రధాన ప్రాజెక్టులు ఉండగా.. 1.48 కోట్ల చేప పిల్లలను వదులుతారు.
ఇందులో మిడ్ మానేరు లో 28.68 లక్షలు, ఎగువ మానేరు లో 10.50 లక్షలు, మల్కపేట రిజర్వాయర్ లో 7.49 లక్షలు, అన్నపూర్ణ ప్రాజెక్టులో 13.69 లక్షలు, మిగతా వాటిని చెరువుల్లో వదలనున్నారు. జగిత్యాల జిల్లాలో 1,016 చెరువులు ఉండగా.. 1.14 కోట్లు, పెద్దపల్లి జిల్లాలో 957 చెరువుల్లో 1.59 కోట్లు, కరీంనగర్ జిల్లాలో 1,016 చెరువులలో 2.15 కోట్ల చేపల పిల్లలను వదిలేందుకు ప్రణాళికలు రూపొందించారు
రెండు రకాల చేప పిల్లలు
ఈసారి రెండు రకాల చేప పిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ ఆఫీసర్లు ప్లాన్ చేశారు. ఏడాదంతా నీరు నిల్వ ఉండే చెరువుల్లో పెద్ద సైజు చేప పిల్లలు, సీజనల్ వర్షాలు వచ్చినప్పుడు నిండే చెరువుల్లో చిన్న సైజు చేప పిల్లలను వదులుతారు. కట్ల(బొచ్చ), రోహు(తెల్ల రకం), శీలావతి, మోసు, కామన్ కార్ప్ తదితర చేపలను పెంచనున్నారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం
అన్ని జిల్లాలకు చేప పిల్లలు సరఫరా అయ్యాయి. రాజన్న సిరిసిల్లలోని చెరువుల్లోకి వదిలేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. రెండు, మూడు రోజుల్లో అన్ని ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో చేప పిల్లలను వదులుతాం. - సౌజన్య, డీఎఫ్ వో, రాజన్నసిరిసిల్ల
