రెండో దశలో 63 శాతం పోలింగ్​

రెండో దశలో 63 శాతం పోలింగ్​
  • త్రిపురలో అత్యధికం (68.92%) మహారాష్ట్రలో అత్యల్పం (43%)
  • 13 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 నియోజక వర్గాల్లో ఎన్నికలు
  • ప్రశాంతంగా ముగిసిన ఓటింగ్​
  • యూపీలో అత్యల్పం (54.85) 88 నియోజకవర్గాల్లో ఎన్నికలు

న్యూఢిల్లీ: లోక్​ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్​ ముగిసింది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా అన్ని చోట్లా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 నియోజకవర్గాల్లో శుక్రవారం ఎన్నికల అధికారులు రెండో విడత పోలింగ్​ నిర్వహించారు. మొత్తం 89 నియోజకవర్గాల్లో పోలింగ్​ జరగాల్సి ఉండగా.. బహుజన సమాజ్​ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి మృతిచెందడంతో మధ్యప్రదేశ్​ రాష్ట్రంలోని బేతుల్​ నియోజకవర్గ  ఎన్నికను రీషెడ్యూల్​ చేశారు. 

మే 7 న మూడో దశలో ఇక్కడ పోలింగ్​ నిర్వహించనున్నారు. కాగా, అన్ని నియోజకవర్గాల్లో కలిపి 63% ఓటింగ్​ నమోదైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. త్రిపురలో అత్యధికంగా 79.46 % ఓటింగ్​ నమోదవగా.. ఉత్తరప్రదేశ్​లో అత్యల్పంగా  54.85 శాతం ఓట్లు పోలయ్యాయి. కేరళలోని 20 సీట్లు, కర్నాటక 4, రాజస్థాన్ 13​, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర 8 చొప్పున, మధ్య ప్రదేశ్​ 7,  అస్సాం, బిహార్​ 5 చొప్పున, పశ్చిమ బెంగాల్, చత్తీస్​గఢ్​ 3 చొప్పున,  జమ్మూకాశ్మీర్​, మణిపూర్​, త్రిపురలో ఒక్కో నియోజకవర్గంలో ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్​.. కొన్నిచోట్ల రాత్రి వరకూ సాగింది. మండుటెండలను కూడా లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్​ కేంద్రాలకు తరలివచ్చి 
ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

అదృష్టాన్ని పరీక్షించుకున్న కీలక నేతలు

రెండో దశపోలింగ్​లో కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో కాంగ్రెస్​ నేతలు రాహుల్​గాంధీ, కేసీ వేణుగోపాల్​, భూపేశ్​ బాఘెల్​, అశోక్​ గెహ్లాట్​ కొడుకు వైభవ్​ గెహ్లాట్, తిరువనంతపురం నుంచి కేంద్రమంత్రి రాజీవ్​ చంద్రశేఖర్ (బీజేపీ), శశి థరూర్​ (కాంగ్రెస్​), నటి హేమమాలిని (బీజేపీ), అరుణ్​ గోవిల్ (బీజేపీ), తేజస్వీ సూర్య (బీజేపీ), లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా ఉన్నారు. ​

కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలు 

కేరళ, బెంగాల్​లో ఈవీఎంలో లోపాలు, బోగస్​ ఓటర్లకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. ఈవీఎంలలో లోపాలతో కొన్నిచోట్ల పోలింగ్​ ఆలస్యంగా ప్రారంభమైంది.  వివిధ అంశాలపై యూపీలోని మథుర, రాజస్థాన్​లోని బన్స్వారా, మహారాష్ట్రలోని పర్భణిలో జనం పోలింగ్​ను బైకాట్​ చేశారు. కేరళలోని పాలక్కడ్, అలప్పుజ, మలప్పురంలో ఓటు వేసిన తర్వాత ముగ్గురు మృతిచెందగా, కోజికోడ్​లోని బూత్​లో ఓ పోలింగ్​ ఏజెంట్​ కుప్పకూలిపోయి, కన్నుమూశాడు. చత్తీస్​గఢలోని గరియాబంద్​ జిల్లా మహాసముంద్ నియోజకవర్గ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలో మధ్యప్రదేశ్​స్పెషల్​ ఆర్మ్​డ్​ ఫోర్స్​కు చెందిన జవాన్​ తన సర్వీస్​ రివాల్వర్​తో కాల్చుకొని చనిపోయాడు. 

  •     ఓ చోట వధువు, వరుడితోసహా కుటుంబంలోని మూడు తరాలు ఓటేసేందుకు వచ్చారు. 
  •      ఇంకొన్నిచోట్ల ఎడ్లబండ్లపై, సీనియర్​ సిటిజన్లు వీల్ ​చైర్​లో పోలింగ్​ స్టేషన్​కు తరలివచ్చారు.
  •   చత్తీస్​గఢ్​లోని కాంకేర్​ నియోజకవర్గం సివ్నీగ్రామంలో పోలింగ్ బూత్​ను పెండ్లి మండపంలాగ డెకరేట్​ చేశారు. వివాహ ఆచారాలను ప్రదర్శించారు. రాజ్​నంద్​గావ్​, మహాసముంద్ ​                   నియోజకవర్గాల్లో వధూవరులు తరలివచ్చి, ఓటుహక్కును వినియోగించుకున్నారు.
  •     ఉత్తరప్రదేశ్​లోని బులంద్​షహర్​లో మహిళలు ఢోలక్​ వాయిస్తూ ఎడ్లబండ్లపై పోలింగ్​ స్టేషన్​కు చేరుకున్నారు.
  •    రాజస్థాన్​లోని కోటా–బుండీ పార్లమెంట్​ నియోజకవర్గ గుంజారా పోలింగ్​ బూత్​లో 108 ఏండ్ల భురీ బాయ్​ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. జమ్మూకాశ్మీర్​లోని రీసీలో హజీ కరాందిన్​​అనే 102 ఏండ్ల వృద్ధుడు ఓటు వేశాడు.
  •     చేనేత పట్టు వస్త్రాలను ప్రోత్సహించేందుకు చామరాజనగర్​ జిల్లాలో 8 మంది మహిళా పోలింగ్​ ఆఫీసర్లు ప్రత్యేకంగా నేసిన చీరలు కట్టుకొని ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. 
  •     మహారాష్ట్రలోని అమరావతి పోలింగ్​ బూత్​కు బీజేపీ క్యాండిడేట్​ నవనీత్​ రానా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానాతో కలిసి బైక్​పై వచ్చారు.