11 రెస్టారెంట్లలో.. 65 కేజీల కుళ్లిపోయిన మాంసం పట్టివేత

11 రెస్టారెంట్లలో.. 65 కేజీల కుళ్లిపోయిన మాంసం పట్టివేత

వినియోగదారుల నుంచి భారీ ఎత్తున దండుకుంటున్న హోటళ్లు, రెస్టారెంట్లలో చాలా వరకు శుచి, శుభ్రతలను పాటించడం లేదని చాలాసార్లు రుజువైంది. ఆహార భద్రత అధికారుల తనిఖీల్లో ఇలా చాలా హోటళ్లు దొరికిపోయాయి. తాము అందించే ఆహార పదార్థాలకు భారీగా వసూలు చేస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు అపరిశుభ్ర వాతావరణంలో కిచెన్లు నిర్వహించడం వంటివి చేస్తున్నాయని గతంలోనే అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. అధికారుల జరిమానాలు విధిస్తున్నా కొన్ని హోటళ్లు యథావిధిగా అపరిశుభ్ర వాతావరణంలోనే కిచెన్లను నిర్వహిస్తున్నాయి. అలాగే నిల్వ ఉన్న, పాడైపోయిన ఆహార పదార్థాలను వడ్డిస్తున్నాయి.

తమిళనాడులోని రెస్టారెంట్లు, హోటళ్లలో ఉండే శుచి శుభ్రత విషయంలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.  విరుదునగర్ జిల్లాలోని రెస్టారెంట్లపై ఆహార భద్రతా విభాగం అధికారులు తనిఖీ చేశారు. 11 రెస్టారెంట్లపై అధికారులు దాడి చేసి 65 కిలోల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.   అంతే కాకుండా మూడు కిలోల యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ ఉత్పత్తులను కూడా సీజ్ చేశారు.  రెస్టారెంట్ల యాజమాన్యాలకు 30 వేల రూపాయిల ఫైన్ విధించారు.

విరుదునగర్ జిల్లాలోని అన్ని రెస్టారెంట్లను , హోటళ్లను తనిఖీ చేస్తామని జిల్లా కలెక్టర్ వీపీ జయశీలన్ తెలిపారు.  ఆహారం విషయంలో కల్తీ గాని, అపరిశుభ్రత ఉన్నట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  హోటళ్ల నిర్వహణ సరిగా లేకపోతే జిల్లా ఆహార భద్రతా శాఖ కార్యాలయ నంబర్ 04562 252255 లేదా ఆ శాఖ వాట్సాప్ నంబర్ 9444042322 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రజలకు సూచించారు. 

రామనాథపురం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎం జయరాజ్, ఎం ధర్మర్ తిరువాడనైలోని రెస్టారెంట్లను తనిఖీ చేశారు.  పలు హోటళ్లలో కలర్ తో తయారు చేస్తున్న 4.5 కిలోల చికెన్ ను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. ఇంకా మూడు కిలోల ప్లాస్టిక్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకొని నాలుగు హోటళ్లకు నోటీసులు జారీ చేసి  4 వేల రూపాయిలు జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.