నందమూరి బాలకృష్ణ 65 ఏళ్ల వయసులో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. యంగ్ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. బాలకృష్ణ నటుడిగా మాత్రమే కాకుండా.. హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా ప్రజలకు సేవ చేస్తున్నారు. గతేడాది 2024తో బాలకృష్ణ తన సినీ నట ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తిచేసుకున్నారు.
ఈ సందర్భంగా ఇటీవలే గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో (IFFI).. బాలకృష్ణ సుదీర్ఘ నట ప్రస్థానాన్ని గుర్తిస్తూ ఘనంగా సన్మానించారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ కలిసి బాలయ్యకు శాలువా కప్పి సత్కరించారు. భారతీయ సినిమాకు చేసిన బాలకృష్ణ కృషిని, ప్రభావాన్ని వారు కొనియాడారు.
ఈ క్రమంలో అక్కడి మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. సెట్‌కు రాకుండా గ్రీన్ స్క్రీన్‌ల ముందు షూటింగ్ చేసే నటులపై ఆయన సెటైర్ వేశారు. ఇపుడు ఆ కామెంట్స్ సినీ ఇండస్ట్రీతో పాటుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.
బాలకృష్ణ తన 50 ఏళ్ల సినీ ప్రస్థానం గురించి మాట్లాడుతూ.. “నేను 50 ఏళ్లు సినిమాల్లో ఉన్నాను. కేవలం ఎన్టీఆర్ కొడుకుగా మాత్రమే కాదు. నాకు సినిమాపై ఉన్న జ్ఞానం, వారసత్వమే నన్ను నిలబెట్టాయి. ఇదే నాకు గర్వంగా ఉంటుంది” అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. అలాగే.. 'టెక్నికల్ డామినేషన్' గురించి ప్రస్తావిస్తూ.. “ ప్రస్తుత రోజుల్లో సినిమా నిర్మాణం పూర్తిగా టెక్నిక్‌పై ఆధారపడి ఉంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రతిదానికీ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. దాంతో హీరోలు కూడా సెట్‌లకు రావడం లేదు. వారు కేవలం గ్రీన్ మ్యాట్ లేదా బ్లూ మ్యాట్ ముందు నటించి పనిముగించేస్తున్నారు. కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే టెక్నాలజీ వాడాలి. కానీ టెక్నాలజీ మీదే ఆధారపడే వాళ్లను నేను హీరోలుగా భావించను. అందువల్ల నేను అలా డూప్లికేట్ కాదు.. ఒరిజినల్” అని బాలకృష్ణ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
ఇపుడు ఈ వ్యాఖ్యలు పలువురు హీరోల అభిమానులని టచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో భిన్నరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అందులో కొంతమంది బాలయ్య వ్యాఖ్యలను సమర్థిస్తుండగా.. మరికొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఏదేమైనా బాలకృష్ణ స్పీచ్ వైరల్ అవ్వడం కామాన్ అని కూడా అంటున్నారు. ఇటీవలే ఏపీ అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవి, మాజీ సీఎం వైస్ జగన్‌పై మాట్లాడిన మాటలు పెద్ద హైలైట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇండస్ట్రీ హీరోల నటనపై కామెంట్స్ చేయడం మరింత హాట్ టాపిక్గా మారాయి.
డిసెంబర్ 5న బాలకృష్ణ ‘అఖండ2:
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న‘అఖండ2 : తాండవం’. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘అఖండ’ ఫస్ట్ పార్ట్‌లో పిల్లలు, ధర్మం, ప్రకృతి జోలికి ఎవరైనా వస్తే భగవంతుడు మనిషిలో ఆవహిస్తాడని చూపించారు. ఈ సినిమాలో సనాతన హైందవ ధర్మాన్ని చూపించబోతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుకొచ్చింది. ఎప్పటిలాగే బాలకృష్ణ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించి, అదిరిపోయే డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు.
‘ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్లినా మీకు కనిపించేది ఒక మతం.. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం.. సనాతన హైందవ ధర్మం’ ‘దేశం జోలికొస్తే మీరు దండిస్తారు. దైవం జోలికొస్తే మేం ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రయిక్’ అని చెబుతూ విలన్స్‌పై బాలయ్య విరుచుకుపడిన విధానం హైప్‌ను క్రియేట్ చేసింది.
