చనిపోయిన 65 ఏండ్లకు.. బ్రిటిష్ సైంటిస్ట్ శవం లభ్యం

చనిపోయిన 65 ఏండ్లకు..  బ్రిటిష్ సైంటిస్ట్ శవం లభ్యం
  • అంటార్కిటికాలో రీసెర్చ్ చేయడానికెళ్లి ప్రమాదవశాత్తు మృతి 
  •  వెదర్ మార్పులతో మంచు కరగడం వల్ల బయటపడిన డెడ్ బాడీ
     

అంటార్కిటికా: మంచు కొండల్లో రీసెర్చ్ కోసమని 1959లో అంటార్కిటికాకు వెళ్లిన బ్రిటిష్ శాస్త్రవేత్త డెన్నిస్ టింక్ బెల్ ప్రమాదవశాత్తు అక్కడే మృతి చెందాడు. అప్పుడు ఎంత వెతికినా దొరకని ఆయన డెడ్ బాడీ ఇప్పుడు దాదాపు 65 ఏండ్ల తర్వాత  బయటపడింది. డెన్నిస్ బెల్ 1958లో ఫాక్‌‌‌‌లాండ్ ఐలాండ్స్ డిపెండెన్సీస్ సర్వే (ఇప్పుడు బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే-)లో మెటియరాలజిస్ట్‌‌‌‌గా చేరారు. రెండేండ్ల పాటు అంటార్కిటికాలో పరిశోధనలు చేయడానికి వెళ్లారు. కింగ్ జార్జ్ ఐలాండ్‌‌‌‌లోని అడ్మిరాల్టీ బేలో ఉన్న చిన్న బేస్‌‌‌‌లో ముగ్గురు సహోద్యోగులతో కలిసి పనిచేశారు. అతను వెదర్ బెలూన్‌‌‌‌లు పంపి, ఆ డేటాను రేడియో ద్వారా ప్రభుత్వానికి  పంపేవాడు. 

కింగ్ జార్జ్ ఐలాండ్‌‌‌‌ మ్యాపింగ్ లోనూ  కీలక పాత్ర పోషించాడు. అయితే,1959 జులై 26న చలికాలంలో డెన్నిస్ బెల్.. తన కొలిగ్ జెఫ్ స్టోక్స్ తో కలిసి ఎకాలజీ గ్లేషియర్‌‌‌‌ సర్వేకు బయలుదేరాడు. అకస్మాత్తుగా లోయలో పడ్డాడు. జెఫ్ స్టోక్స్ తాడు సాయంతో కాపాడడానికి ప్రయత్నించాడు. బెల్ రోప్‌‌‌‌ను తన బెల్ట్‌‌‌‌కు కట్టుకుని పైకి చేరుకుంటుండగా బెల్ట్ తెగిపోయి అతను మళ్లీ క్రిందికి పడిపోయాడు. వాతావరణం తీవ్రంగా మారడంతో  రెస్క్యూ సాధ్యం కాలేదు. 

ఆయన డెడ్ బాడీ కూడా దొరకలేదు. చివరకు బెల్ మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. అయితే,  పోలాండ్ శాస్త్రవేత్తల బృందం రీసెర్చ్ కోసం ఈ  జనవరి 29న ఎకాలజీ గ్లేషియర్ చేరుకున్నది. వాతావరణ మార్పుల వల్ల అక్కడ మంచు కొండలన్నీ కరిగిపోవడంతో వారికి చెక్కుచెదరకుండా ఉన్న  డెన్నిస్  బెల్ శవం కనిపించింది.