ఎల్‌ఐసీకి 65 ఏండ్లు

ఎల్‌ఐసీకి 65 ఏండ్లు
  • రూ. 38,04,610 కోట్లకు చేరిన ఆస్తుల విలువ
  • లైఫ్ ఫండ్‌‌ విలువ రూ. 34,36,686 కోట్లు. 
  •  మార్కెట్ ​షేర్​ 66 శాతం

హైదరాబాద్‌‌, వెలుగు: మారుమూల ప్రాంతాలకూ బీమా సేవలు అందిస్తున్న లైఫ్‌‌ ఇన్సూరెన్స్‌‌ కార్పొరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఎల్‌‌ఐసీ) మెజారిటీ ఇండియన్ల జీవితంలో ఒక భాగంగా మారింది. ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా ఎల్‌‌ఐసీ సేవలు పొందుతున్నారనడం అతిశయోక్తి కాదు. ఈ ప్రభుత్వరంగ సంస్థ బుధవారం 65వ బర్త్‌‌డే జరుపుకుంటోంది. 1956 లో కేవలం రూ .ఐదు కోట్ల ప్రారంభ మూలధనంతో స్టార్టయిన ఈ కంపెనీ ఆస్తుల విలువ ఇప్పుడు రూ. 38,04,610 కోట్లు.  లైఫ్ ఫండ్‌‌ విలువ రూ. 34,36,686 కోట్లు. బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ స్టడీ ప్రకారం ఇది ప్రపంచంలోనే మూడో పటిష్టమైన ఇన్సూరెన్స్‌‌ కంపెనీ. అత్యంత విలువైన  కంపెనీల్లో దీనిది పదోర్యాంకు వచ్చింది. మనదేశ బీమా మార్కెట్లో ఎల్‌‌ఐసీకి 66.18శాతం మార్కెట్ వాటా ఉంది.  మొత్తం పాలసీల్లో ఎల్‌‌ఐసీ వాటా 74.58 శాతం వరకు ఉంది.  2020–-21 సంవత్సరంలో  2.10 కోట్ల కొత్త పాలసీలను అమ్మింది. బీమా బిజినెస్‌‌ను 3.48శాతం పెంచింది. కొత్త సంవత్సరం ప్రీమియాల విలువ రూ .1.84 లక్షల కోట్లుగా రికార్డయింది. ఎల్‌‌ఐసీకి 8 జోనల్‌‌ ఆఫీసులు, 113 డివిజనల్ ఆఫీసులు, 74 కస్టమర్ జోన్లు, 2048 బ్రాంచ్ ఆఫీసులు, 1,546 శాటిలైట్ ఆఫీసులు, 42 వేల  ప్రీమియం పాయింట్లు  ఉన్నాయి. లక్ష మందికి పైగా ఎంప్లాయీస్‌‌ ఉన్నారు. ఏజెంట్ల సంఖ్య 13.53 లక్షలు దాటింది.  ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి ఎల్‌‌ఐసీ 80 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో చేతులు కలిపింది.  సమాజంలోని అన్ని వర్గాలకు అవసరమైన పాలసీలు అందిస్తోంది. వీటిలో ఎండోమెంట్, టర్మ్ అస్యూరెన్స్, చిల్డ్రన్‌‌, పెన్షన్, మైక్రో ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, యూనిట్ లింక్డ్ పాలసీలను అందిస్తోంది.  
అన్ని పనులూ ఆన్‌లైన్‌లోనే..
కస్టమర్లు సులువుగా ప్రీమియం చెల్లించడానికి ఎల్​ఐసీ వివిధ డిజిటల్ ప్లాట్‌ఫారాలతో ఒప్పందాలు చేసుకుంది.  డెబిట్/క్రెడిట్ కార్డులు/స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌, నెట్‌బ్యాంకింగ్, ఐఎంపీఎస్‌, వాలెట్లు, ప్రీపెయిడ్ కార్డులు, యాప్‌లు ద్వారా కూడా డబ్బు కట్టవచ్చు.  వైఎల్‌ఐసీ యాప్ తోపాటు పేటీఎం,ఫోన్‌పే, గూగుల్‌పే, అమెజాన్ పే, మోబిక్విక్  యాప్‌ల ద్వారా  పాలసీ వాయిదాలను కట్టవచ్చు.  రిన్యూవల్‌ ప్రీమియం వసూళ్లలో డిజిటల్ వాటా ఆల్-టైమ్ హై 74.8శాతానికి చేరుకుంది. ఆన్‌లైన్ లో లోన్ రీపేమెంట్,  లోన్ వడ్డీల చెల్లింపు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. శాటిలైట్ ఆఫీసుల్లో పాలసీల రెన్యువల్‌,  క్లెయిమ్ ఫారమ్‌ వంటి పనులను సులువుగా చేసుకోవచ్చు. కాలం చెల్లిన పాలసీల రివైవల్‌ కోసం ఎల్‌ఐసీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది.   ఈ కార్యక్రమం అక్టోబరు 22న ముగుస్తుంది.    పేదరికం నిర్మూలన, విద్య, వైద్యం,  అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించే ఎన్జీఓలకు ఎల్​ఐసీ సాయం చేస్తోంది. ఇప్పటి వరకు 589 ప్రాజెక్టులకు సాయం అందించింది. ఎల్‌ఐసీకి 14 దేశాల్లో ఆఫీసులు ఉన్నాయి.