హైదరాబాద్​ పార్లమెంట్ సెగ్మెంట్​లో.. 6 లక్షల 6 4 వేల బోగస్​ ఓట్లు

హైదరాబాద్​ పార్లమెంట్ సెగ్మెంట్​లో..   6 లక్షల 6 4 వేల బోగస్​ ఓట్లు

ఖైరతాబాద్, వెలుగు: హైదరాబాద్​ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 6.64 లక్షల బోగస్​ఓట్లు ఉన్నాయని పీసీసీ జనరల్​సెక్రటరీ ఫిరోజ్​ఖాన్​ ఆరోపించారు. ఎంపీ ఎన్నికలలోపే ఎలక్షన్​ కమిషన్ విచారణ చేపట్టి వాటిని తొలగించాలని ఆయన డిమాండ్​ చేశారు. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో బుధవారం బోగస్​ఓట్లకు సంబంధించిన ఆధారాలు ఆయన ప్రదర్శించారు. తాము రెండు నెలలుగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెలుగు చూసినట్టు చెప్పారు. ఎన్నో ఏండ్లుగా ఎంఐఎం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్​ పార్లమెంటు పరిధిలో మొత్తం 21లక్షల ఓట్లు ఉండగా.. అందులో 6.64 లక్షల ఓట్లు నకిలీవేనని ఆయన అన్నారు. 

గత అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్​రాజ్, జీహెచ్​ఎంసీ కమిషనర్​ రొనాల్డ్​రోస్​కు విజ్ఞప్తి చేయగా.. వారు చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించగా గత ప్రభుత్వంలోని మంత్రులు హరీశ్​​రావు, కేటీఆర్ ​అధికారులపై ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు. ఒకే ఇంటి నంబరుపై 600 ఓట్లు ఎక్కడైనా ఉంటాయా అని ఆయన ప్రశ్నించారు. ఇండ్లు లేని చోట సర్వే నంబరుతో ఓట్లను కల్పించారని చెప్పారు. రౌడీయిజంతో ఓటర్లను  బయపెట్టి, అధికారుల అండతో మాత్రమే ఎంఐఎం గెలుస్తోందని, ఇంటింటికీ వెళ్లి సర్వేచేసి కొత్త లిస్టుతో ఎన్నికలకు వెళితే ఎంఐఎం 2 సీట్లకు పరిమితం అవుతుందన్నారు. 

బోగస్​ ఓట్ల కారణంగానే తాను ఓటమి చెందానని పేర్కొన్నారు. ఇప్పటికే  ఈవిషయంపై సీఎంకు ఫిర్యాదు చేశానని, బోగస్​ఓట్లను తొలగించిన తర్వాతే ఎంపీ ఎన్నికలకు పోవాలన్నారు. ఈ పోరాటంలో తాను మృతి చెందినా.. భావితరాలకు మేలు చేసేందుకు దేనికైనా సిద్ధమని ఫిరోజ్​ఖాన్​ అన్నారు.