ఉద్యోగాల భర్తీ ఎప్పుడో?

ఉద్యోగాల భర్తీ ఎప్పుడో?
  • వాటర్ బోర్డులో 692 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
  • అయినా ముందుకు కదలని ప్రాసెస్
  • జీఓ వచ్చి 10 నెలలు గడుస్తున్నా ఎక్కడి ఫైల్ అక్కడే

మహా నగరానికి తాగునీటిని సరఫరా చేసే వాటర్​బోర్డులో కొలువల భర్తీకి ఇంకా ముహూర్తం ఖరారు కానట్లుగా ఉంది. ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చి 10 నెలలు గడుస్తున్నా, ఎక్కడి ఫైల్ అక్కడే ఉంది. ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ సంస్థలను ఆశ్రయించాల్సిన జలమండలి, ఆ అంశాన్నే పక్కన పడేసినట్లుగా తెలుస్తోంది. దీంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే అధికారం చెలాయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

గతేడాది ఆగస్టులో 692 ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. దీనికి సంబంధించిన జీఓ అప్పుడే విడుదలైనట్లు సమాచారం. అయినా ఉద్యోగాల నియామకానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అజామాయిషీలోనే చాలా వరకు బోర్డు పాలన నడుస్తోంది. దీనికితోడు వచ్చే నెలలో దాదాపు150 మంది ఉద్యోగులు పదవీ విరమణకు సిద్ధమయ్యారు.

ఇక ఉన్న ఉద్యోగులపై మరింత పనిభారం పడుతుందని వారు వాపోతున్నారు. ఏడాది ప్రారంభంలో ఉద్యోగాల భర్తీ అంటూ వాటర్ బోర్డు ఉన్నతాధికారులు హడావుడి చేశారు. గతంలో రిక్రూట్ చేసిన ఉద్యోగాల్లో మిగిలిన మేనేజర్ పోస్టులను భర్తీ చేయాలని కోరినట్లుగా తెలుస్తుండగా, ప్రభుత్వం అనుమతించిన అన్ని స్థాయిల కొలువులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రభుత్వం అనుమతించిన పోస్టుల్లో పీ అండ్ ఏ విభాగంలో జీఎం, డీజీఎం, మేనేజర్, సీనియర్ ఆఫీసర్, ఆఫీసర్, సీనియర్ గ్రేడ్ అసిస్టెంట్లు, అసిస్టెంట్లు క్యాడర్లలో దాదాపు 80 ఖాళీలు ఉండగా, జనరల్ పర్పస్ విభాగంలో వాటర్ సప్లయ్, సీవరేజ్ కలిపి దాదాపు 400 వరకు భర్తీకి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

అదే విధంగా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించే డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు(ఇంజినీర్) కలిపి 90పైనే ఉండగా, ఎఫ్​అండ్ ఏ, టెక్నీషియన్ గ్రేడ్ విభాగాలను కలిపి110 వరకు ఉన్నాయి. అదే విధంగా పదోన్నతుల వ్యవహారం చాలాకాలంగా పెండింగ్ లోనే ఉందని, దీంతో అర్హత ఉన్నా పదోన్నతి రాక ఇబ్బంది పడుతున్నామని పలువురు ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.

అవుట్ సోర్సింగ్ సిబ్బందే దిక్కు..

నగరంలో దాదాపు 10 వేల కిలోమీటర్ల మేర నీటి సరఫరా వ్యవస్థ, 8 వేల కిలోమీటర్ల వరకు మురుగు నీటి పైపులు, 9.7 లక్షలకు పైగా నల్లాలు ఉండగా, ప్రధానంగా అవుటర్‌ రింగ్‌ రోడ్డు వరకు మురుగు నీటి వ్యవస్థ జలమండలికే అప్పగించింది. అయినా ఉన్న సిబ్బందితోనే క్షేత్రస్థాయి లో విధులు చేయిస్తుండటంతో పనిభారం ఎక్కువైపోయింది. దీంతో మెరుగైన సేవలు అందే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందితోపాటు కీలకమైన ఆపరేషన్స్ అండ్ మెయింటెన్స్ విభాగం, పలు డైరెక్టర్ల పేషీలన్నీ దాదాపు అవుట్ సోర్సిం గ్ సిబ్బందే వ్యవహారాలను చక్కబెడుతున్నారు. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికతన విధులు నిర్వర్తించే కొందరు అవినీతికి పాల్పడుతున్న ఘటనలు.