
టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా నెలకొన్న సంక్షోభంపై తెలుగు సినీ ప్రముఖులు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదిస్తున్నారు. 30 శాతం వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు చేపట్టిన సమ్మె కారణంగా అన్ని షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పలువురు అగ్ర నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌తో భేటీ అయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్ లో నెలకొన్న పరిణామాలను, సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
నిర్మాతల విజ్ఞప్తి..
మంత్రి దుర్గేశ్‌తో సమావేశం అనంతరం నిర్మాతలు మీడియాతో మాట్లాడుతూ థియేటర్ల యజమానులు ఎదుర్కొంటున్న నష్టాలను తగ్గించడానికి ప్రత్యేక విధానాలు రూపొందించాలని కోరినట్లు తెలిపారు. ముఖ్యంగా, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, అలాగే సినీ రంగాన్ని ఒక ప్రత్యేక పరిశ్రమగా గుర్తించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సూచనలు ఇస్తూ, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ఈ సమస్యల పరిష్కారానికి నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోరినట్లు నిర్మాతలు తెలిపారు. మంత్రి దుర్గేశ్ ఈ అపాయింట్‌మెంట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారని, త్వరలోనే వారిని కలుస్తామని వెల్లడించారు.
రాష్ట్ర సచివాలయంలో సినీ నిర్మాతలతో సమావేశమై, సినీ రంగ సమస్యలు మరియు సినీ కార్మికుల ఆందోళనలపై నిర్మాతల నుండి వినతిపత్రం స్వీకరించాను. ఇరుపక్షాల అభిప్రాయాలను శ్రద్ధగా విని, ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రుల గార్లకు నివేదించి చర్చిస్తానని తెలియజేశాను. అలాగే… pic.twitter.com/RGvBHMXcCC
— Kandula Durgesh (@kanduladurgesh) August 11, 2025
మంత్రి దుర్గేశ్ హామీలు
నిర్మాతల భేటీ అనంతరం మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ టాలీవుడ్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించడానికి నిర్మాతలు వచ్చారు. ప్రస్తుత ఆందోళన నేపథ్యంలో కార్మికులు, నిర్మాతల ఇద్దరి అభిప్రాయాలను వింటాం అని పేర్కొన్నారు. ఈ సమస్యపై ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ సామరస్యంగా మాట్లాడుకోవాలని సూచించారు. అవసరమైతే, ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి చర్చిస్తామన్నారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరైనా ఏపీలో స్టూడియోలు, రీ రికార్డింగ్ థియేటర్లు నిర్మించడానికి ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహకారాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.