
- పెద్దపల్లి జిల్లా మొగల్ పహాడ్లో వెలుగులోకి
- స్థానిక రైతులకు అమ్మేశామని 45 ఏండ్ల కిందట్నే డిక్లరేషన్ ఇచ్చినా ఆయన పేరిటే రికార్డు
- సీలింగ్ యాక్ట్ రూల్స్ ను పట్టించుకోని అధికారులు
- కాస్తులో ఉన్న రైతులకు అందని పట్టాదారు పాస్ బుక్స్
హైదరాబాద్, వెలుగు: రాజులు పోయినా, రాజ్యాలు పోయినా ‘ధరణి’ పుణ్యమా అని వాళ్ల పేరిట మాత్రం ఇంకా వందల ఎకరాల భూములు రెవెన్యూ రికార్డుల్లో కనిపిస్తున్నాయి. ఒక కుటుంబానికి 54 ఎకరాలకు మించి భూమి ఉండొద్దని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ చెప్తున్నప్పటికీ.. చాలా ఏండ్ల కిందట్నే చనిపోయిన జమీందార్ పేరిట రెవెన్యూ అధికారులు ధరణి పోర్టల్ లో 697 ఎకరాలు నమోదు చేయడం వివాదాస్పదంగా మారింది. పెద్దపల్లి జిల్లా అంతర్ గాం మండలం మొగల్ పహాడ్ లో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
వారసుల పేరిట అమ్మేందుకు ప్లాన్
ఈ భూమి రాజా వెంకట మురళీ మనోహర్ రావు పేరిట ఉండడంతో కొందరు వ్యక్తులు వారసుల పేరిట అమ్మేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొందరు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ధరణి పోర్టల్లోని ఈ వివరాలను చూపించి వంద ఎకరాలను అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. ఈ విషయమై అంతర్ గాం తహసీల్దార్ పెరుమాళ్ల సంపత్ ను వివరణ కోరగా.. ధరణి రికార్డుల్లో ఈ భూమి పట్టాదారుగా రాజా వెంకట మురళీ మనోహర్ రావు పేరు మీద వచ్చినప్పటికీ డిజిటల్ సైన్ పెండింగ్లో పెట్టామని తెలిపారు. తాను ఆరునెలల కిందట్నే వచ్చానని, భూరికార్డుల మార్పుల్లో జరిగిన విషయాలు తనకు తెలియవన్నారు.
ఐదారు దశాబ్దాల కిందట్నే సదరు జమీందారు వద్ద కొందరు రైతులు భూములు కొనుగోలు చేశారు. భూములను రైతులు, అటు తర్వాత వారి వారసులు సాగు చేస్తూ వస్తున్నారు. కానీ వాళ్లకు ప్రభుత్వం పట్టాదారు పాసు బుక్స్ జారీ చేయలేదు. ఇప్పటికీ భూరికార్డుల్లో జమీందార్ పేరే రావడం భూరికార్డుల ప్రక్షాళన పేరిట జరిగిన ప్రహసనానికి అద్దం పడుతున్నది.
అమ్మేశానని ఎప్పుడో రాసిచ్చినా..!
అంతర్ గాం, శ్రీరాంపూర్ మండలాలతోపాటు చుట్టుపక్కల మరికొన్ని గ్రామాల్లో వ్యవసాయ భూములను రుసుం ఇనామ్ కింద జమీందార్ రాజవెంకట మురళీ మనోహర్ రావుకు సుమారు 2 వేల ఎకరాల భూమిని అప్పటి నిజాం ప్రభుత్వం అప్పగించింది. స్వాతంత్ర్యానంతరం 1950లో జమీందారీ వ్యవస్థ రద్దయినప్పటికీ భూములు వారి చేతుల్లోనే ఉండిపోయాయి. ఇలా పెద్దపల్లి జిల్లా అంతర్ గాం మండలం మొగల్ పహాడ్ లోనూ రాజవెంకట మురళీ మనోహర్ పేరిట 1,274 ఎకరాల భూమి ఉండేది. 1973లో వచ్చిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం అంత భూమి ఒకే వ్యక్తి పేరిట ఉండొద్దనే నిబంధనతో చట్టం రావడానికి ముందే ఈ భూమిని స్థానిక రైతులకు తాను అమ్మేశానని 1975లో సదరు పట్టాదారు డిక్లరేషన్ ఇచ్చారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాస్తులో ఉన్న రైతుల పేర్లు రికార్డుల్లో నమోదు కాలేదు. ఆ తర్వాత ఇదే గ్రామానికి చెందిన కొంత భూమిని ఎన్టీపీసీ సేకరించింది. అయితే వారు సేకరించిన భూమికి నిజమైన యజమానులు ఎవరో తేలకపోవడంతో పరిహారం ఇంకా డిపాజిట్ రూపంలోనే ఉంది. ఈ భూమి పోను మిగతా భూమిని స్థానిక రైతులు సాగు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ భూమి అమ్మకాలు, కొనుగోళ్ల ద్వారా చాలా మంది చేతులు మారింది. రెండు, మూడు తరాలు మారిపోయాయి. కానీ ధరణి పోర్టల్ లో మాత్రం వారి పేర్లు కాకుండా రాజా వెంకట మురళీ మనోహర్ రావు పేరే వచ్చింది.
9 మెయిన్ సర్వే నంబర్లలో..!
రాజా వెంకట మురళీ మనోహర్ రావు సన్ ఆఫ్ వెంకట రాధాకిషన్ రావు పేరిట మొగల్ పహడ్ లో 9 మెయిన్ సర్వే నంబర్లలో 697 ఎకరాల భూమి ఉంది. సర్వే నంబర్ 23/2/2లో 33.36 ఎకరాలు, సర్వే నంబర్ 24/1/1లో 18.28 ఎకరాలు, 24/2లో 6.10 ఎకరాలు, 24/3లో 6.29 ఎకరాలు, 24/4లో 20 ఎకరాలు, 24/5లో 19.18 ఎకరాలు, 24/6లో 25 ఎకరాలు, 24/7లో 18 ఎకరాలు, 24/8లో 5 ఎకరాలు, 53/1/1/1లో 14.20 ఎకరాలు, 53/2లో 4.20 ఎకరాలు, 53/3లో 2 ఎకరాలు, 54/2లో 10 ఎకరాలు, 54/3/1లో 5 ఎకరాలు, 55/1లో 58.11 ఎకరాలు, 55/2లో 5 ఎకరాలు, 55/3లో 3 ఎకరాలు, 55/4/1లో 4 ఎకరాలు, 55/5లో 6 ఎకరాలు, 55/6లో 6 ఎకరాలు, 56/1లో 28.10 ఎకరాలు, 56/2లో 18 ఎకరాలు, 56/3లో 18 ఎకరాలు, 56/4లో 18 ఎకరాలు, 56/5లో 18 ఎకరాలు, 56/6లో 9.20 ఎకరాలు, 56/7లో 8 ఎకరాలు, సర్వే నంబర్ 57/1లో 23.23 ఎకరాలు, 57/10లో 6.23 ఎకరాలు, 57/11లో 18 ఎకరాలు, 57/12లో 5.20 ఎకరాలు, 57/3లో 9.27 ఎకరాలు, 57/4లో 10.30 ఎకరాలు, 57/5/1లో 4 ఎకరాలు, 57/5/2లో 10.26 ఎకరాలు, 57/6లో 18 ఎకరాలు, 57/7లో 10.20 ఎకరాలు, 57/8లో 6.22 ఎకరాలు, 57/9లో 6.23 ఎకరాలు, సర్వే నంబర్ 58/2లో 4.30 ఎకరాలు, 58/3లో 105.0800 ఎకరాలు, సర్వే నంబర్ 59/1/1లో 41.36 ఎకరాలు, 59/2లో 8 ఎకరాలు, 59/3లో 10.02 ఎకరాలు, 59/4లో 6 ఎకరాలు, 59/5లో 10 ఎకరాలు నమోదై ఉంది.