- మార్కెట్లో దళారులే వ్యాపారం చేస్తున్నరని ఫైర్
- సౌలత్లూ సరిగ్గా లేవని అసంతృప్తి
మెహిదీపట్నం, వెలుగు: గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్లోని సమస్యలపై రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం మార్కెట్‌ను ఆయన సందర్శించారు. రైతులు, వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులు, మార్కెట్ కమిటీ సభ్యులపై మండిపడ్డారు. మార్కెట్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇక్కడ రైతుల కంటే దళారులే వ్యాపారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే ఎలాంటి అక్రమాలు సహించబోమని స్పష్టం చేశారు.
మార్కెట్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు సరిగా లేవని, పార్కింగ్ స్థలం కూడా అక్రమ వ్యాపారులకు అడ్డగా మారిందని, బయో ప్లాంట్ సరిగా పనిచేయడం లేదన్నారు. చుట్టూ ఉన్న ప్రహరీ గోడ కూలిపోయిందని ధ్వజమెత్తారు. మార్కెట్ మురుగునీటితో నిండిపోయిందని, వచ్చే పోయేవారికి సరైన మార్గం లేకపోవడం బాధాకరమన్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఈ సందర్భంగా రైతులు ఆయనకు వివరించారు.
పూల మార్కెట్ పూర్తిగా వ్యాపారుల చేతుల్లోనే ఉందని, వారికి కేటాయించిన షెడ్లు కాకుండా ముందు ప్రాంతాన్ని కబ్జా చేశారని గుర్తించారు. దీనిపై మార్కెట్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. రైతులు రోడ్లపై అమ్ముకుంటే వ్యాపారులు మార్కెట్ లోపల అమ్మడం చూసి షాక్ అయ్యారు. నగర మార్కెట్లు దళారుల అడ్డాలుగా మారాయని, గతంలో బోయిన్పల్లి మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి చూశానని చెప్పారు. మార్కెట్లో అధికారులు అందుబాటులో లేరని, రికార్డులు బీరువాలో పెట్టి తాళం వేసుకుని లీవ్‌లో ఉన్నారని పేర్కొన్నారు.
