టీజీఎంసీలో జీఓ రగడ!.. ఎక్స్ అఫీషియో మెంబర్లుగా నలుగురు అధికారులకు చాన్స్

టీజీఎంసీలో జీఓ రగడ!.. ఎక్స్ అఫీషియో మెంబర్లుగా నలుగురు అధికారులకు చాన్స్
  • ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న డాక్టర్స్ యూనియన్లు
  • సంస్థ స్వయం ప్రతిపత్తిని 
  • దెబ్బతీసే కుట్రగా ఆరోపణలు
  • జీఓను రద్దు చేయాలనే డిమాండ్​తో ఆందోళనలు 

మంచిర్యాల, వెలుగు : తెలంగాణ మెడికల్​కౌన్సిల్(టీజీఎంసీ)లో జీవో. 229  చిచ్చు రేపింది. సంస్థలో ఎక్స్ అఫీషియో మెంబర్లుగా మరో నలుగురు ఆఫీసర్లను నియమించడానికి వీలు కల్పిస్తూ గత డిసెంబర్​22న ప్రభుత్వం జారీ చేసిన జీవోపై డాక్టర్ల యూనియన్లు ఆందోళనకు దిగాయి. టీజీఎంసీ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే కుట్రలో భాగంగానే జీవోను తెచ్చారని ఆరోపిస్తున్నాయి. జీవోను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్​తో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ), హెల్త్​కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్(హెచ్ఆర్డీఏ), మెడికల్​టాన్స్​ఫోర్స్​టీమ్( ఎంటీటీ) ఆధ్వర్యంలో వారం రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి.  తెలంగాణ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్​–1968 రూల్స్​కు విరుద్ధంగా జీవో ఉందని అసోసియేషన్ల నేతలు వాదిస్తున్నారు. 

నామినేటెడ్​ సభ్యుల సంఖ్య 16 ఉండగా.. 

ప్రస్తుతం టీజీఎంసీ ఎగ్జిక్యూటివ్​ కౌన్సిల్​లో మొత్తం 25 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో వివిధ డాక్టర్ల యూనియన్ల నుంచి 13 మందిని ఎన్నుకుంటారు. మిగతా 12 మందిలో ఆరుగురు సభ్యులను రాష్ర్ట్ ప్రభుత్వం నామినేట్​చేస్తుంది. మరో ఇద్దరు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నుంచి ఉంటారు. ఇంకో నలుగురు ఎక్స్​అఫీషియో సభ్యులను రాష్ర్ట ప్రభుత్వం నియమిస్తుంది.

వీరికి అదనంగా మరో నలుగురు ఎక్స్​అఫీషియో సభ్యుల నియామకానికి వీలు కల్పిస్తూ జీవో 229ను తీసుకురావడంతో  టీజీఎంసీలో నామినే టెడ్​సభ్యుల సంఖ్య మొత్తం16 మందికి చేరుతుంది. దీంతో ఎన్నికైన సభ్యుల సంఖ్య మైనార్టీకి పడిపోతుందని డాక్టర్ల యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  

కౌన్సిల్ స్వయం ప్రతిపత్తిపై ఆందోళన

టీజీఎంసీ స్వతంత్ర సంస్థ అని, ఇందులో ప్రభుత్వాధికారుల జోక్యం పెరగడంతో  కౌన్సిల్ లో స్వేచ్ఛ, నిర్ణయాధి కారం దెబ్బతింటాయని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. సభ్యుల సంఖ్యను పెంచడం ద్వారా మెజార్టీ  ఆఫీసర్ల మాటే చెల్లుబాటు అవుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వైద్య విద్యార్హత లేని అధికారులు నిర్ణయా లు తీసుకోవడం ఏ విధంగా సమంజసమని ప్రశ్నిస్తున్నాయి.  ప్రస్తుతం ఫేక్  డాక్టర్లపై టీజీఎంసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి క్రమంలో సంస్థను బలహీనపరిచే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నాయి.  

టీజీఎంసీ విధులు ఇవి..

టీజీఎంసీకి చెందిన డాక్టర్లు వైద్య ప్రమాణాలను పాటిస్తూ ప్రజలకు మెరుగైన, సురక్షితమైన సేవలు అందించేలా పర్యవేక్షించడం ప్రధాన బాధ్యతగా ఉంది.  వైద్య విద్య చదివినవారు డాక్టర్​గా ప్రాక్టీస్​చేయాలంటే ముందుగా టీజీఎంసీలో రిజిస్ర్టేషన్​చేసుకోవాలి. రాష్ర్టవ్యాప్తంగా క్వాలిఫైడ్​డాక్టర్ల డేటాబేస్‌ను కూడా నిర్వహిస్తుంది.  మెరు గైన వైద్య విధానాలు, వైద్య విద్య, శిక్షణలో ఉన్నత ప్రమాణాలను ప్రోత్సహి స్తుంది. అర్హత లేని, ఫేక్ డాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం కూడా టీజీఎంసీకే ఉంది. 

యూనియన్ల డిమాండ్లు .. 

జీవో. 229ని వెంటనే రద్దు చేయాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.  టీజీఎంసీలో ఎన్నికైన డాక్టర్ల ప్రాధాన్యతను, ప్రజాస్వామ్య సమతుల్యతను కాపాడాలని కోరుతున్నాయి.  వైద్యరంగ నియంత్రణలో నాన్​డాక్టర్స్​జోక్యాన్ని పూర్తిగా తొలగించాలని పేర్కొంటున్నాయి. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫేక్ డాక్టర్లపై టీజీఎంసీ తీసుకుంటున్న చర్యలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని స్పష్టం చేస్తున్నాయి.  

జీవోను వెనక్కి తీసుకోవాలి 

ఇప్పటికే టీజీఎంసీలో ఉన్న సభ్యులకు అదనంగా మరో నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేదంటే పోరాటం ఉధృతం చేస్తాం. వైద్య వృత్తి పవిత్రతను, స్వతంత్రతను కాపాడడంలో ఐఎంఏ, హెచ్ఆర్డీఏ నిత్యం ముందు వరుసలో ఉంటాయి. 
- డాక్టర్​ యెగ్గన శ్రీనివాస్, టీజీఎంసీ మెంబర్​