5జీ రాకతో అభివృద్ధిలో వేగం పెరుగుతుంది

5జీ రాకతో అభివృద్ధిలో వేగం పెరుగుతుంది
  • 5జీ వల్ల ఆర్థిక వ్యవస్థకు 450 బిలియన్ డాలర్ల సహకారం
  • ఘనంగా ట్రాయ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
  • పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: దేశంలో 5జీ రాకతో ఇంటర్నెట్ వేగం మాత్రమే కాదు.. అభివృద్ధిలో కూడా వేగం పెరుగుతుందని.. అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. 5జీ వల్ల ఆర్థిక వ్యవస్థకు 450 బిలియన్ డాలర్ల సహకారం అందుతుందన్నారు ప్రధాని మోడీ. ఈ దశాబ్దం చివరికి 6 జీ సేవలు ప్రారంభించాలని ఆకాంక్షిస్తున్నామని.. ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని తెలిపారు ప్రధాని మోడీ. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా... ట్రాయ్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో వర్చువల్ గా పాల్గొన్నారు ప్రధాని మోడీ, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్. ట్రాయ్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా.. పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశారు. 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ దశాబ్దం చివరి నాటికి 6జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయయన్నారు. 2జీ యుగంలో అనేక విధానపరమైన లోపాలు చోటు చేసుకున్నాయని.. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో పారదర్శకతకు పెద్దపీట వేశామని.. 4జీ సేవలు అందుబాటులోకి తెచ్చి 5జీ దిశగా వెళుతున్నామని ప్రధాని మోడీ వివరించారు. 5జీ సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చాక  పరిపాలనా వ్యవస్థలో అనేక ప్రజారంజక మార్పులు వస్తాయని, దేశ ఆర్ధిక వ్యవస్థలో 450 బిలియన్ డాలర్లు వచ్చి చేరతాయన్నారు. అంతేకాదు జీవన సౌలభ్యానికి, విధుల నిర్వహణ, వ్యాపారాలకు వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు.